ఆందోళనే ఆయుధంగా! | - | Sakshi
Sakshi News home page

ఆందోళనే ఆయుధంగా!

May 8 2026 1:19 PM | Updated on May 8 2026 1:19 PM

ధరలు దారుణంగా..

కొండపి వేలం కేంద్రంలో పొగాకు బేళ్లను పరిశీలిస్తున్న కంపెనీల ప్రతినిధులు

సింగరాయకొండ: చంద్రబాబు ప్రభుత్వ తీరుతో తమకు తీవ్రంగా నష్టం జరుగుతోందని పొగాకు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేలం కేంద్రాల్లో పొగాకు బేళ్ల కొనుగోళ్లలో కంపెనీల ప్రతినిధులు మాయాజాలం ప్రదర్శించి ధరలు దిగ్గోయడంపై మండిపడుతున్నారు. రైతులకు అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడంపై ఆగ్రహిస్తున్నారు. మద్దతు ధరల కోసం ఆందోళన దిశగా అడుగులు వేస్తుండగా.. పొగాకు రైతులకు వైఎస్సార్‌ సీపీ అండగా నిలుస్తోంది. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో చేపట్టిన ముందస్తు చర్యల కారణంగా పొగాకు రైతులకు మద్దతు ధర లభించి లాభాల వర్షం కురిసింది. కానీ, చంద్రబాబు ప్రభుత్వంలో రెండో సంవత్సరం కూడా పొగాకు రైతుకు నష్టం తప్పేలా లేకపోవడంతో ఆందోళన బాట పడుతున్నారు. ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితులు, తెగుళ్ల కారణంగా దిగుబడి తగ్గింది. అదనపు ఖర్చు కారణంగా ఎకరాకు రూ.7 వేల వరకు ఖర్చు పెరిగింది. కానీ, ఈ సంవత్సరం వేలం ప్రారంభంలో కేజీ ధర రూ.250 ఉండగా, తర్వాత ధరలు పెరుగుతాయని ఆశించిన రైతుకు నిరాశే మిగిలింది. ధరలు పెరగకపోగా క్రమేనా తగ్గుతూ కేజీ రూ.232కు పడిపోయింది. ప్రస్తుతం అది కాస్తా రూ.200 మాత్రమే ఉండటంతో రైతులు పోరుబాట పట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రస్తుత ధరలతో పొగాకు రైతుకు ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు భారీగా నష్టాలు వచ్చే అవకాశం ఉందని, ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టి తమను ఆదుకునేందుకు కృషి చేయాలని రైతులు కోరుతున్నారు.

82,475 హెక్టార్లలో పొగాకు సాగు...

పొగాకు బోర్డు ఒంగోలు రీజియన్‌ పరిధిలో 11 వేలం కేంద్రాలుండగా, ఈ ఆర్థిక సంవత్సరంలో రీజియన్‌ పరిధిలో 82,475 హెక్టార్లలో పొగాకు పంట సాగైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 2026–27లో పంట సీజన్‌కు సంబంధించి ఒంగోలు రీజియన్‌ పరిధిలో 90.20 మిలియన్‌ కేజీల పొగాకు పండించటానికి బోర్డు అనుమతి ఉండగా, సుమారు 130 మిలియన్‌ కేజీల పొగాకు పండించినట్లు బోర్డు అధికారులు చెబుతున్నారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం సాగు విస్తీర్ణం తగ్గినట్లు బోర్డు అధికారులు తెలియజేస్తున్నారు.

తగ్గిన ధరలతో దిగాలు...

ఈ సంవత్సరం జిల్లాలోని 11 వేలం కేంద్రాల్లో మొదటి విడతగా మార్చి 25వ తేదీ కందుకూరు–1, పొదిలి వేలం కేంద్రాల్లో పొగాకు కొనుగోళ్లు ప్రారంభించారు. రెండో విడతగా ఏప్రిల్‌ 9వ తేదీ కొండపి, ఒంగోలు, కనిగిరి, డీసీ పల్లి, కలిగిరి, వెల్లంపల్లి వేలం కేంద్రాల్లో పొగాకు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. వేలం ప్రారంభం నుంచి బ్రైట్‌ గ్రేడ్‌ పొగాకు కేజీ ధర రూ.250 పలకగా, మిగిలిన గ్రేడ్‌లు రూ.240 నుంచి రూ.220 వరకు పలికాయి. ప్రస్తుతం కేవలం రూ.200 మాత్రమే ఉండగా సరాసరి ధర రూ.225 మాత్రమే లభిస్తోంది. దీంతో ధరలు పెరుగుతాయని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. కర్ణాటకలో పొగాకుకు కేజీ సరాసరి ధర రూ.230 వచ్చిందని, ఇక్కడ కూడా ఆ స్థాయిలో వచ్చే అవకాశం ఉందని భావించినప్పటికీ ప్రస్తుతం కేజీ సరాసరి ధర రూ.225 మాత్రమే పలకటంతో రైతులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటూ పోరుబాట పడుతున్నారు.

గిట్టుబాటు ధర లభించేనా...

ప్రస్తుతం వేలం కేంద్రాల్లో లభిస్తున్న ధరలు చూస్తే రైతులకు నిద్రపట్టని పరిస్థితి నెలకొంది. కొండపి నియోజకవర్గంలోని కొండపి వేలం కేంద్రంలో కేజీ సరాసరి ధర రూ.227 ఉండగా, టంగుటూరులో కేజీ ధర రూ.233 మాత్రమే ఉంది. దీంతో రైతులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఈ ప్రకారం రైతుకు ఒక్కో బ్యారన్‌కు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు నష్టం వస్తుందని భావిస్తున్నారు.

ప్రస్తుత ధరలతో ఆత్మహత్యలే శరణ్యం...

ఈ సంవత్సరం ధరలు తగ్గటంతో పాటు ఇరాన్‌–ఇజ్రాయిల్‌ యుద్ధం కారణంగా కొనుగోలు దారులు లేక ధరలు మరింత దిగజారే పరిస్థితి నెలకొంది. ఒకవేళ కేంద్రానికి బేళ్లు తీసుకెళ్తే వాటికి నానా పరీక్షలు చేసి కొనుగోలు చేయటంతో పాటు భారీగా వెనక్కి పంపుతున్నారు. ఒక రోజు 30 శాతం, మరో రోజు 40 శాతం, గురువారం అయితే 55 శాతం బేళ్లు వెనక్కి పంపారని కొండపి పొగాకు వేలం కేంద్రం పరిధిలోని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా అయితే ఆత్మహత్యలే శరణ్యమని, ఇక కౌలు రైతుల పరిస్థితి చెప్పటానికి వీలులేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వైఎస్సార్‌ సీపీ పోరుబాట...

పొగాకుకు మద్దతు ధర లభించకపోవటంతో రైతులు వేలం కేంద్రాల వారీగా పోరుబాట పడుతున్నారు. గురువారం పొదిలి వేలం కేంద్రం పరిధిలో రైతులు పోరుబాట పట్టగా శుక్రవారం వైఎస్సార్‌ సీపీ కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి, పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ ఆధ్వర్యంలో పొగాకు రైతులు టంగుటూరు పొగాకు వేలం కేంద్రం వద్ద మద్దతు ధర కోసం ఽనిరసన కార్యక్రమం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. శుక్రవారం ఉదయం 7.30 గంటల నుంచి నిరసన కార్యక్రమం జరుగుతుందని, పొగాకు రైతులతో పాటు వైఎస్సార్‌ సీపీలోని వివిధ విభాగాల రైతులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో మాదిరిగా ఆదుకోవాలని డిమాండ్‌...

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో రైతుల సంక్షేమం కోసం ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి పంటలకు మద్దతు ధరలు కల్పించి ఆదుకున్న విషయాన్ని రైతులు గుర్తుచేసుకుంటున్నారు. గతంలో వ్యాపారులు సిండికేట్‌ అయి పొగాకు ధరలు పడిపోతుంటే.. ఆనాటి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపి ఆదుకుంది. కానీ, నేడు చంద్రబాబు ప్రభుత్వంలో ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదని, పొగాకు బోర్డు అధికారులు పొగాకు సాగు తగ్గించండి.. ప్రత్యామ్నాయ పంటలు పండించండని చెప్పడమే తప్ప, ఆ ప్రత్యామ్నాయ పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలన్న ఆలోచన చేయడం లేదని విమర్శిస్తున్నారు. ఈ ప్రభుత్వంలో రైతులకు కష్టాలే తప్ప లాభాలు లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement