ఒంగోలు మెట్రో: ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా తెలుగు వెలుగుల సాహిత్య సదస్సును ఈ నెల 10వ తేదీ ఒంగోలులోని నెక్ట్స్ జన్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభించనున్నట్లు పరిషత్తు అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ తెలిపారు. ప్రఖ్యాత కవులు, సాహితీ మూర్తులు పాల్గొని ప్రకాశం జిల్లా తెలుగు వెలుగులపై ప్రసంగిస్తారని వెల్లడించారు. జిల్లాలోని కవులు, రచయితలు, భాషాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విశిష్ట సాహిత్య సదస్సును విజయవంతం చేయాలని కోరారు.
ఒంగోలు సబర్బన్: ఒంగోలు ఆర్డీఓగా టి.చంద్రశేఖరనాయుడు గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఆర్డీఓగా పనిచేసిన లక్ష్మీప్రసన్న అమరావతి బదిలీ కావడంతో నూతన ఆర్డీఓగా చంద్రశేఖరనాయుడు బాధ్యతలు తీసుకున్నారు. చీరాల ఆర్డీఓగా పనిచేస్తూ బదిలీపై ఇక్కడకు చంద్రశేఖరనాయుడు వచ్చారు. బాధ్యతలు తీసుకున్న అనంతరం జేసీ కల్పనా కుమారిని మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను బహూకరించారు.
ఒంగోలు సబర్బన్: స్కూల్, కాలేజీ బస్సులకు నిబంధనల ప్రకారం ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు తీసుకోవాలని డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (డీటీసీ) ఆర్.సుశీల స్పష్టం చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని స్కూల్, కాలేజీ బస్సులను రవాణా శాఖ అధికారులచే గురువారం ఆకస్మికంగా తనిఖీ చేయించారు. ఈ సందర్భంగా డీటీసీ మాట్లాడుతూ జిల్లాలోని 744 స్కూలు, కాలేజీల యాజమాన్యాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. ఏఐఎస్ 63 నిబంధనలు పాటించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. యాజమాన్యాలు రవాణా శాఖ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్, ఇతర అవసరమైన పత్రాలను నవీకరించుకోవాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. హెవీ లైసెన్స్ కలిగి ఐదేళ్ల అనుభవం ఉన్న 60 సంవత్సరాల్లోపు వారిని డ్రైవర్లుగా నియమించుకోవాలన్నారు. నిబంధనలకు అనుగుణంగా లేని బస్సులను సీజ్ చేస్తామని చెప్పారు.
దొనకొండ: దొనకొండలోని విమానాశ్రయాన్ని మంగళగిరి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గీతాంజలి బృందం గురువారం పరిశీలించింది. విమానాశ్రయం చుట్టూ భూమి హద్దులు, హెలీప్యాడ్, రన్ వేలను పరిశీలించారు. విమానాశ్రయానికి చెందిన భవనం పైకి ఎక్కి పూర్తి సమాచారం సేకరించారు. మొత్తం ఎన్ని ఎకరాల భూమి ఉంది.. అదనంగా ఎంత కేటాయించారు.. ఆ భూముల పరిస్థితి ఏమిటి.? నీటి వనరులు, తదితర మౌలిక సదుపాయాల గురించి రెవెన్యూ సిబ్బందితో చర్చించారు. విమానాశ్రయానికి సంబంధించిన అనేక విషయాల గురించి విమానాశ్రయ కేర్ టేకర్ రామకృష్ణతో చర్చించారు. దొనకొండ విమానాశ్రయంలో విమాన శిక్షణ కేంద్రం (ఎఫ్టీఏ) ఏర్పాటు దిశగా చర్యలు జరుగుతున్నాయని గీతాంజలి తెలిపారు. త్వరలో ఎయిర్‌పోర్ట్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ విమానాశ్రయాన్ని సందర్శిస్తారని, ఈ నేపథ్యంలో పరిశీలనకు వచ్చామని ఆమె వివరించారు. డిప్యూటీ కలెక్టర్ వెంట తహసీల్దార్ రమాదేవి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.


