పంచాయతీల్లో..స్పెషల్‌ సమస్యలు..! | - | Sakshi
Sakshi News home page

పంచాయతీల్లో..స్పెషల్‌ సమస్యలు..!

May 8 2026 1:19 PM | Updated on May 8 2026 1:19 PM

● సర్పంచ్‌ల పదవీకాలం ముగియడంతో పంచాయతీలకు స్పెషల్‌ ఆఫీసర్ల నియామకం ● మార్కాపురం జిల్లాలో 406 పంచాయతీలకుగానూ 176 మందే స్పెషల్‌ ఆఫీసర్లు ● కొన్ని మండలాల్లో ఒక అధికారికి 5 పంచాయతీల బాధ్యతలు ● అదనపు బాధ్యతలు చూడలేకపోతున్న స్పెషల్‌ ఆఫీసర్లు ● సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రజల గగ్గోలు

● సర్పంచ్‌ల పదవీకాలం ముగియడంతో పంచాయతీలకు స్పెషల్‌ ఆఫీసర్ల నియామకం ● మార్కాపురం జిల్లాలో 406 పంచాయతీలకుగానూ 176 మందే స్పెషల్‌ ఆఫీసర్లు ● కొన్ని మండలాల్లో ఒక అధికారికి 5 పంచాయతీల బాధ్యతలు ● అదనపు బాధ్యతలు చూడలేకపోతున్న స్పెషల్‌ ఆఫీసర్లు ● సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రజల గగ్గోలు

మార్కాపురం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వలంటీర్ల వ్యవస్థను రద్దు చేయడం, సచివాలయాల వ్యవస్థకు ప్రాధాన్యత తగ్గించడంతో గ్రామాల్లో సమస్యలు పరిష్కారం కాక ప్రజలు సతమతమవుతున్నారు. చిన్నచిన్న పనులకు కూడా రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. పంచాయతీల్లో కనీస వసతులు కరువై ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో గత నెల 2వ తేదీతో సర్పంచ్‌ల పదవీకాలం కూడా ముగియడంతో 3వ తేదీ నుంచి గ్రామ పంచాయతీల్లో స్పెషల్‌ ఆఫీసర్ల పాలన ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో సర్పంచ్‌ల స్థానంలో మండల స్థాయి అధికారులైన తహసీల్దార్‌, ఎంపీడీఓ, డిప్యూటీ తహసీల్దార్‌, ఎంఈఓ, ఈఓఆర్‌డీ, వ్యవసాయ, హార్టీకల్చర్‌, ఐసీడీఎస్‌, పంచాయతీరాజ్‌ ఏఈ, డీఈ, వెటర్నరీ అసిస్టెంట్లను గ్రామ పంచాయతీలకు స్పెషల్‌ ఆఫీసర్లుగా నియమించారు.

అదనపు భారంతో అరకొరగా విధులు...

మార్కాపురం జిల్లాలోని మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లో ఉన్న 21 మండలాల్లో 406 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వాటన్నింటికి కలిపి 176 మంది అధికారులను స్పెషల్‌ ఆఫీసర్లుగా నియమించారు. సాధారణంగా ప్రతి పంచాయతీకి ఒక స్పెషల్‌ ఆఫీసర్‌ను నియమించాలి. కానీ, పూర్తి స్థాయిలో అధికారులు లేకపోవడంతో ఒక్కొక్క అధికారికి 5 నుంచి 6 పంచాయతీలు కేటాయించారు. దీంతో వీరు సొంత శాఖ బాధ్యతలు చూడటంతో పాటు తమకు కేటాయించిన గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీరు, డ్రైనేజీ, ఇతర సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల పర్యవేక్షణ వంటి బాధ్యతలు చూడాల్సి ఉంది. అదనపు భారం కారణంగా అవన్నీ వారు చూడలేకపోతుండటంతో పంచాయతీల్లో సమస్యలు తిష్ట వేస్తున్నాయి. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

గ్రామ పంచాయతీల్లో అస్తవ్యస్తంగా పాలన...

మార్కాపురం జిల్లాలో స్పెషల్‌ ఆఫీసర్ల నియామకం గందరగోళంగా మారింది. ఒక్కొక్క అధికారికి 5 నుంచి 6 పంచాయతీలు అప్పగించారు. త్రిపురాంతకం మండలంలో 24 పంచాయతీలకు ఏడుగురు అధికారులను మాత్రమే కేటాయించారు. దోర్నాల మండలంలో 14 పంచాయతీలకు ఐదుగురు, హనుమంతునిపాడు మండలంలో 23 పంచాయతీలకు 8 మంది, కొనకనమిట్ల మండలంలో 26 పంచాయతీలకు 8 మంది, సీఎస్‌ పురం మండలంలో 23 పంచాయతీలకు 8 మంది, కనిగిరిలో 25 పంచాయతీలకు 8 మంది అధికారులను నియమించారు. వారంతా తాము నిర్వర్తిస్తున్న బాధ్యతలతో పాటు అదనంగా స్పెషల్‌ ఆఫీసర్ల బాధ్యతలు కూడా నిర్వర్తిస్తూ పూర్తిస్థాయిలో పనిచేయలేకపోతున్నారు. తమకు కేటాయించిన గ్రామాలకు మొక్కుబడిగా వెళ్తున్నారు. ప్రస్తుతం వేసవికాలం కావడంతో మార్కాపురం, పొదిలి, కొనకనమిట్ల, తర్లుపాడు మండలాల్లో తాగునీటి సమస్య ఏర్పడింది. పంచాయతీ కార్యదర్శులు ఉన్నప్పటికీ వారికి రొటీన్‌ కార్యక్రమాలే సరిపోతున్నాయి. స్పెషల్‌ ఆఫీసర్లు పట్టించుకోకపోవడంతో సమస్యలు పరిష్కారం కావడం లేదు. పంచాయతీల్లో పాలన అస్తవ్యస్తంగా తయారై ప్రజలు అవస్థపడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి స్పెషల్‌ ఆఫీసర్లు వారికి కేటాయించిన గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించేలా చూడాలని, సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement