విద్యుదాఘాతంతో యువకుడు మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో యువకుడు మృతి

May 8 2026 1:19 PM | Updated on May 8 2026 1:19 PM

విద్యుదాఘాతంతో యువకుడు మృతి ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు సీజ్‌ కుళ్లిన స్థితిలో మృతదేహం లభ్యం

మార్కాపురం: విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి చెందిన సంఘటన గురువారం సాయంత్రం మార్కాపురం పట్టణంలోని కంభం రోడ్డులో చోటుచేసుకుంది. గొట్టిపడియ గ్రామానికి చెందిన తంగిరాల శ్రీనివాసరెడ్డి(23) మార్కాపురం పట్టణంలోని కంభం రోడ్డులో గల శివాజీనగర్‌లో నివాసముంటూ టెంట్‌ హౌస్‌లో పని చేస్తున్నాడు. గురువారం సాయంత్రం కంభం రోడ్డులోని ఎల్‌ఐసీ ఆఫీసు పక్క వీధిలో గల ఇంటి వద్ద లైటింగ్‌ ఏర్పాటు చేస్తున్న క్రమంలో విద్యుత్‌ వైర్లు మెయిన్‌ లైనుకు తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. యువకుడి మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించారు.

మార్కాపురం: బెంగళూరు నుంచి మార్కాపురానికి అతివేగంతో ప్రయాణిస్తున్న ఆర్‌వీటీ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సును మార్కాపురం వద్ద గురువారం రవాణాశాఖ అధికారులు సీజ్‌ చేశారు. విజయవాడ రవాణాశాఖ కమిషనర్‌ కార్యాలయంలోని కంట్రోల్‌ రూము అధికారుల పర్యవేక్షణలో భాగంగా బెంగళూరు నుంచి మార్కాపురం వస్తున్న బస్సు 80 కిలోమీటర్లకు మించి ప్రయాణిస్తున్నట్లు గుర్తించి స్థానిక రవాణాశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో మార్కాపురం ఎంవీఐలు మాధవరావు, భాస్కరరావులు బస్సును సీజ్‌ చేశారు. ఇటీవలే అన్నీ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సుల్లో వీఎల్‌టీడీ (వెహికల్‌ లోకేషన్‌ ట్రాకింగ్‌ డివైజ్‌)ను ఏర్పాటుచేసి 80 కిలోమీటర్ల వేగం దాటిన బస్సులను గుర్తించి సీజ్‌ చేస్తున్నట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి అతి వేగంగా నడిపే వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బస్సును సీజ్‌ చేసి డిపోకు తరలించినట్లు తెలిపారు.

టంగుటూరు: కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం లభ్యమైంది. ఈ సంఘటన మండలంలోని కొణిజేడు–పొందూరు గ్రామాల మధ్య గురువారం జరిగింది. పోలీసుల వివరాల మేరకు..మండలంలోని కొణిజేడు–పొందూరు గ్రామాల మధ్య ఉన్న ఇలగలేరు సమీపంలో జామాయిల్‌ కర్ర కొడుతున్న కూలీలకు కుళ్లిపోయిన వావన రావడంతో చుట్టుపక్కన పరిశీలించగా కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం లభ్యమైంది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా అక్కడ ఆధార్‌కార్డు కనిపించింది. అందులో మృతుని పేరు బీహార్‌కు చెందిన సాకి సహానిగా గుర్తించారు. మృతుడు చనిపోయి 20 రోజులు దాటిందని, మృతదేహం బాగా కుళ్లిపోయిందని ఎస్సై నాగమల్లేశ్వరరావు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement