● ఎస్పీ హర్షవర్థన్ రాజు
ఒంగోలు టౌన్: దేశాన్ని కొల్లగొట్టిన బ్రిటీష్ ముష్కరులను గడగడలాడించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటం స్ఫూర్తిదాయకమని ఎస్పీ హర్షవర్థన్ రాజు అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతిని నిర్వహించారు. అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బ్రిటీష్ ముష్కరులను దేశం నుంచి తరిమి కొట్టేందుకు మన్యంలోని ప్రజలను చైతన్యం అలుపెరుగని పోరాటాలు చేశాడని గుర్తు చేశారు. ఆయన ప్రాణత్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. నేటి యువత అల్లూరి జీవితాన్ని అధ్యయనం చేయాలని, కులమతాలకతీతంగా దేశాభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్‌ఐ సీతారామి రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.


