తౌషిక్‌ మృతికి కారకులను కఠినంగా శిక్షించాలి | - | Sakshi
Sakshi News home page

తౌషిక్‌ మృతికి కారకులను కఠినంగా శిక్షించాలి

Feb 16 2026 7:15 AM | Updated on Feb 16 2026 7:15 AM

తౌషిక

తౌషిక్‌ మృతికి కారకులను కఠినంగా శిక్షించాలి

శ్రీచైతన్య నవోదయ కోచింగ్‌ విద్యార్థి అనుమానాస్పద మృతిపై కలెక్టరేట్‌ ఎదుట ధర్నా గొంతు పిసికి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారని తల్లిదండ్రుల ఆరోపణ గంటకుపైగా స్తంభించిన ట్రాఫిక్‌ పోలీసులతో బాధితుల వాగ్వాదం

ఒంగోలు టౌన్‌: సింగరాయకొండలోని శ్రీచైతన్య నవోదయ కోచింగ్‌ సెంటర్‌ విద్యార్థి సయ్యద్‌ తౌషిక్‌ (11) శనివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతిచెందడానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాలు కలెక్టరేట్‌ ఎదుట రోడ్డుపై ఆదివారం ధర్నాకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. విద్యార్థి మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని, విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. సుమారు గంట సేపు జరిగిన ధర్నాతో ట్రాఫిక్‌ స్తంభించింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను శాంతింపచేయడానికి ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. శనివారం సాయంత్రం 5 గంటలకు ఫోన్లో తమతో మాట్లాడిన తౌషిక్‌ హుషారుగానే ఉన్నాడని, అంతలోనే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని పాఠశాల యాజమాన్యం ఫోన్‌ చేసి చెప్పడం నమ్మదగిందిగా లేదని తలిదండ్రులు మీడియా ముందు కన్నీరు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా బాలుడి తండ్రి సయ్యద్‌ అలీ మాట్లాడుతూ..తౌషిక్‌ మృతికి సంబంధించి తమకు అనేక సందేహాలున్నాయని చెప్పారు. తౌషిక్‌ ఆత్మహత్యకు పాల్పడి ఉంటే అతడిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లి అత్యవసర చికిత్స ఎందుకు చేయించలేదని ప్రశ్నించారు. సమీపంలో ఉన్న ఒంగోలుకు తరలించకుండా కందుకూరుకు తీసుకెళ్లడంలో ఉద్దేశం ఏమిటన్నారు. బాలుడి గొంతు మీద గాయాలు ఎక్కడ నుంచి వచ్చాయో పాఠశాల యాజమాన్యం చెప్పాలని డిమాండ్‌ చేశారు. తమ కుమారుడి మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని, తౌషిక్‌ను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. హాస్టల్‌ వార్డన్‌ బాబ్జీ గతంలోనూ తమ కుమారుడిపై చేయి చేసుకున్నాడని, అతడి వ్యవహార శైలిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నందున అతడిని అరెస్టు చేసి విచారించాలని కోరారు. పాఠశాల యాజమాన్యంతో కుమ్మకై ్కన సింగరాయకొండ ఎస్సైను విచారణ నుంచి తప్పించాలని కోరారు. ఏ తప్పు చేయకపోతే పాఠశాల యాజమాన్యం ఎందుకు పరారీలో ఉందో చెప్పాలన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్‌ వినోద్‌ మాట్లాడుతూ హాస్టల్‌ వార్డన్‌ విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడమే దీనికి కారణమన్నారు. 6వ తరగతి చదువుకునే విద్యార్థికి ఆత్మహత్య చేసుకునే కష్టమేముంటుందని, పాఠశాలలో జరిగిన విద్యార్థి మరణంపై అధికారులు తగిన విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. 2007లోనూ ఈ పాఠశాలలో ఒక విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన జరిగిందని గుర్తు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పాఠశాలను సీజ్‌ చేయాలని అధికారులను కోరారు.

డీఆర్‌ఓ హామీతో ధర్నా ఉపసంహరణ..

ధర్నా జరుగుతున్న సమయంలో అటుగా డీఆర్‌ఓ చిన ఓబులేసు వచ్చారు. ధర్నా విషయం అడిగి తెలుసుకున్న ఆయన బాధితుల వద్దకు వచ్చి మాట్లాడారు. తౌషిక్‌ మరణం గురించి పూర్తి వివరాలు అందజేయాలని కోరారు. దాంతో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు వినోద్‌, బాలుడి తండ్రి సయ్యద్‌ అలీ, ఇతర కుటుంబ సభ్యులు డీఆర్‌ఓకు వినతి పత్రం అందజేశారు. కలెక్టర్‌తో మాట్లాడిన డీఆర్‌ఓ బాలుడి మృతిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దాంతో బాధితులు ధర్నా విరమించారు.

తౌషిక్‌ మృతికి కారకులను కఠినంగా శిక్షించాలి1
1/1

తౌషిక్‌ మృతికి కారకులను కఠినంగా శిక్షించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement