రెడ్‌బుక్ పాలనతో జీవితాలు చిన్నాభిన్నం
యర్రగొండపాలెం: రాష్ట్రంలో రెడ్‌బుక్ వెర్రి పాలనతో ప్రజల జీవితాలు చిన్నాభిన్నమవుతున్నాయని యర్రగొండపాలెం ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతులు ఆర్థికంగా అన్ని విధాలుగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సాధారణంగా పంట చేతికొచ్చి అమ్ముకుని సంక్రాంతి పండుగను రైతులంతా వైభవంగా జరుపుకుంటారన్నారు. ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేదని, పండుగకు అన్నదాతలంతా దూరమయ్యారని ఆవేదన చెందారు. అందుకు ప్రధాన కారణం ఎర్రబుక్కు అనే వెర్రి పాలన అని అన్నారు. భోగి పండుగ సందర్భంగా బుధవారం వై.పాలెంలో భోగి మంటలను ఎమ్మెల్యే వెలిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతిలో భాగంగా భోగి పండుగకు చెడు కార్యక్రమాలను తగలబెట్టి మంచి కార్యక్రమాలకు నాంది పలకాలన్న ఉద్దేశంతో తమ ఇళ్లలోని పనికిరాని చెత్తను తీసుకొచ్చి తగులబెడతామని, ఆ విధంగానే రాష్ట్రంలో పేరుకుపోయిన చెత్తను కూడా తగలబెట్టుకోవాలని, అందుకే ఎర్రబుక్కును మంటల్లో వేసి తగలపెట్టామని అన్నారు. సంక్రాంతి అంటే ఎడ్ల పోటీలకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. అనేక మంది కోడి పందేలు వేస్తుంటారని, వాటి కాళ్లకు కత్తులు కట్టి బరిలో దింపుతారని, అవి కత్తుల దెబ్బకు బరిలోనే విలవిల్లాడి కళ్ల ఎదుటే ప్రాణాలు వదలుతాయని, టీడీపీ నాయకులు కూడా అలాంటి నరమేధానికి పాల్పడుతున్నారని అన్నారు. బరిలో కోళ్లు ఏ విధంగా కొట్టుకునిచస్తున్నాయే రాష్ట్రం నలుమూలలా రాజకీయం అనే బరిలో అనేక మంది రక్తం చిందిస్తున్నారని అన్నారు. చిన్న పిల్లలు మానభంగానికి గురవుతున్నారని, అనేకమంది హత్యలకు గురవుతున్నారని, మానసిక వేదన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్న ఆలోచనతో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల పక్షాన నిలిచి పోరాడుతున్నారని, ఇప్పటికై నా కూటమి నాయకులు కళ్లుతెరిచి సుపరిపాలన దిశగా అడుగులు వేయాలని ఎమ్మెల్యే తాటిపర్తి హితవుపలికారు. లేకుంటే ప్రజలంతా చంద్రబాబు ప్రభుత్వాన్ని భోగి మంటల్లో కాల్చివేస్తారని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ ఏకుల ముసలారెడ్డి, వివిధ విభాగాల నాయకులు కె.ఓబులరెడ్డి, సయ్యద్ జబీవుల్లా, టి.సత్యనారాయణరెడ్డి, బిజ్జం రమణారెడ్డి, ఆవుల రమణారెడ్డి, ఆర్.అరుణాబాయి, పల్లె సరళ, పబ్బిశెట్టి శ్రీనివాసులు, దోగిపర్తి సంతోష్ కుమార్, గోళ్ల కృష్ణారావు పాల్గొన్నారు.
భోగి మంటల్లో రెడ్‌బుక్ దహనం చేసిన వై.పాలెం ఎమ్మెల్యే
తాటిపర్తి చంద్రశేఖర్


