ఆసక్తికరంగా పడవల పోటీలు
కొత్తపట్నం: సంక్రాంతి సంబరాల్లో భాగంగా కొత్తపట్నం మండలంలోని మడనూరు గ్రామం పెద్దపట్టపుపాలెంలో బుధవారం నిర్వహించిన పడవల పోటీలు ఆసక్తికరంగా నిలిచాయి. ప్రకాశం జిల్లా మత్స్యకార సంక్షేమ సమితి ఆధ్వర్యంలో పడవల పోటీలతో పాటు ముగ్గుల పోటీలు నిర్వహించారు. సముద్రంలో తెడ్ల సహాయంతో నడిచే పడవలతో నిర్వహించిన పోటీల్లో ఒక్కో పడవలో ఇద్దరు చొప్పున పాల్గొన్నారు. తెడ్ల సహాయంతో పడవను వేగంగా నడిపి పోటీపడ్డారు. అలలు కొంచెం ఇబ్బందిపెట్టినప్పటికీ ఎటువంటి అవాంతరాలు లేకుండా పోటీలు సాగాయి. ఒంగోలుకు చెందిన శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ వంశీకృష్ణ, శ్రీనిధి ఫిషరీస్ ప్రతినిధి వాయల విజయరత్నం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రథమ స్థానంలో వజ్జిరెడ్డిపాలేనికి చెందిన బ్రహ్మయ్య, శ్రీను నిలిచి రూ.15 వేలు బహుమతి అందుకున్నారు. ద్వితీయ స్థానంలో అదే గ్రామానికి చెందిన శోభన్‌బాబు, రాము రూ.10 వేలు గెలుచుకున్నారు. మూడో బహుమతిగా హరిబాబు, సున్నపు కొండలరావు రూ.5 వేలు, నాలుగో బహుమతిగా చిన్నంగారిపాలేనికి చెందిన ఏడుకొండలు, తాతారావు రూ.3 వేలు గెలుపొందారు. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన మహిళలకు ఆకర్షణీయమైన బహుమతులు అందజేశారు. వర్మ గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ రంగారావు, ఎంఎస్‌ఎస్ రాష్ట్ర సెక్రటరీ సున్నపు తిరుపతిరావు, రాష్ట్ర కార్యదర్శి రేవు చలపతివర్మ, ప్రకాశం జిల్లా అధ్యక్షుడు పొన్నపూడి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి కొక్కిలగడ్డ శ్రీనివాసులు, గౌరవాధ్యక్షుడు కొండూరు శ్రీనివాసులు, జిల్లా విద్యా కమిటీ అధ్యక్షుడు అక్కంగారి లక్ష్మణ్, పామంచి రమేష్, గ్రామ కాపులు, ప్రజలు పాల్గొన్నారు.
ఆసక్తికరంగా పడవల పోటీలు


