రాష్ట్రాన్ని దోచుకుంటున్న కూటమి నేతలు
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
యర్రగొండపాలెం: ఎన్నికల ముందు కూటమి నాయకులు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తరువాత ఏ ఒక్కటి నెరవేర్చలేదని, చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు. సంక్రాంతి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ పర్యవేక్షణలో వైపాలెంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీల్లో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అయినా ప్రజలకు చేసింది శూన్యమని, తమ కూటమి నాయకులకు మాత్రం దోచుకో, దాచుకో, పంచుకో అన్న సంకేతాలు బాగానే ఇస్తున్నారని, ఆ దిశలో డబ్బులన్నీ వారి జోబుల్లోకి వెళ్తున్నాయన్నారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బటన్ నొక్కితే ప్రజలందరి వద్ద డబ్బులు ఉండేవని, వ్యాపారులు కూడా బాగుండేవారన్నారు. మనం జీఎస్టీలు, ట్యాక్స్‌లు కడుతున్నాం, జగన్‌మోహన్‌రెడ్డి పేదలకు పంచేస్తున్నారని ఆ రోజుల్లో వ్యాపారులు అనేవారన్నారు. అప్పట్లో పంచడం వల్లనే వ్యాపారాలు బాగా జరిగాయని, ఇప్పుడు తమ షాపులు మూసేసుకుంటున్నారని, జగన్‌మోహన్‌రెడ్డి ఎంత ముందు ఆలోచనతో ఉండేవారో ఒక సారి గుర్తించాలని అన్నారు. ఎమ్మెల్యే తాటిపర్తి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు తమ పార్టీకి అన్ని విధాలా అండదండలు అందిస్తున్నారని, వారి ఆశీర్వాదం జగనన్నపై ఎల్లవేళలా ఉంటుందని అన్నారు. ఎడ్లపోటీల్లో రెండవ రోజు పోటీల్లో కూడా ప్రజల స్పందన బాగానే ఉందని చెప్పారు.
భోగి మంటల్లో ‘రెడ్ బుక్’ను కాల్చాలి
చంద్రబాబు ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నించే వారందరినీ రెడ్‌బుక్ పేరుతో అనేక ఇబ్బందులకు గురిచేస్తోందని, కోడి కోసినా, కేక్ కట్ చేసినా పోలీసులకు పంపి కేసులు నమోదు చేయిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్.శ్యామల విమర్శించారు. తెలుగు లోగిళ్ల సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి మండలు వేసుకుంటామని, ఆ రోజు రెడ్‌బుక్‌ను ఆ మంటల్లో వేసి కాల్చాలని ఆమె పిలుపునిచ్చారు. కాయకష్టంచేసి ఆరుగాలం పండించిన పంటలు ఇంటికి చేరుతాయని, ఆ ఆనందంలో రైతులు సంక్రాంతిని వైభవంగా జరుపుకుంటారని ఆమె అన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో అటువంటి పరిస్థితి కనిపించడంలేదని, కనీస మద్దతు ధర లభించక రైతులు దయనీయ స్థితిలో అన్నమో రామచంద్ర అంటున్నారని అన్నారు. జగనన్న పాలన ఐదేళ్లలో ప్రతి ఇంట్లో రోజూ పండుగ జరిగేదని, ప్రస్తుతం చంద్రబాబు పాలనలో పస్తులు పడుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారని ఆమె విమర్శించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సుదూర ప్రాంతాల ఉన్న వారు సైతం తమ స్వగ్రామాలకు చేరుతారని, ముఖ్యంగా యువత, ఐటీ వింగ్‌కు చెందిన వారు తమ గ్రామ పరిస్థితి గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని, రోడ్లు, డ్రైనేజి కాలువల పరిస్థితి, జగనన్న అభివృద్ధి చేసిన నాడు–నేడు పాఠశాలలు ప్రస్తుత దుస్ధితిలపై ఫొటోలు తీసి ట్వీట్ చేయాలని ఆమె కోరారు. వచ్చే ఎన్నికల్లో కూడా వైపాలెంలో వైఎస్సార్ సీపీకి పట్టం కట్టాలని కోరారు. కార్యక్రమంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, కొండపి నియోజకవర్గ పరిశీలకుడు వై.వెంకటేశ్వరరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కేవీ.రమణారెడ్డి, జమ్మలమడుగు నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జి హనుమంతారెడ్డి పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో పంచాయతీ రాజ్ వింగ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూమిరెడ్డి సుబ్బారెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఒంగోలు మూర్తిరెడ్డి, ముస్లిం మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్.బుజ్జి, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుముల అరుణ, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి యేర్వ శేషసేనారెడ్డి, మండల కన్వీనర్లు ఏకుల ముసలారెడ్డి, గంటా వెంకట రమణారెడ్డి, దోమకాల వెంకటేశ్వర్లు, సింగారెడ్డి పోలిరెడ్డి, పాలిరెడ్డి కృష్ణారెడ్డి, వివిధ విభాగాల నాయకులు కె.ఓబులరెడ్డి, సయ్యద్ జబీవుల్లా, తోకల ఆవులయ్య, గుండారెడ్డి వెంకటేశ్వరరెడ్డి, జానకి రఘు, ఆర్.అరుణాబాయి, పల్లె సరళ, గార్లపాటి శార, వాడాల పద్మ, మిడత నరసింహారావు, ఎం.ఆదిశేషు, పి.రాములు నాయక్, కందూరి కాశీవిశ్వనాధ్, పబ్బిశెట్టి శ్రీనివాసులు, దోగిపర్తి సంతోష్ కుమార్, గోళ్ల కృష్ణారావు, సూరె శ్రీనివాసులు, సూరె ప్రసాద్ టి.సత్యనారాయణరెడ్డి, ఎ.కోటిరెడ్డి, ఎ.రమణారెడ్డి పాల్గొన్నారు.


