హద్దు మీరితే మూల్యం తప్పదు
అమరావతి రైతుల దృష్టిని మరల్చేందుకే ఎల్లో మీడియా వ్యక్తిగత విమర్శలు ఒంగోలు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు ధ్వజం మాజీ సీఎం వైఎస్ జగన్‌పై ఏబీఎన్ డిబేట్‌లో చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం ఏబీఎన్ యాంకర్ వెంకటకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు
ఒంగోలు టౌన్: ఐదేళ్ల పాలనలో దేశంలో అనేక ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాకుండా కనివినీ ఎరుగని విధంగా అభివృద్ధి పనులు చేపట్టిన ప్రజా నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి హద్దుమీరి విమర్శలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని ఒంగోలు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు హెచ్చరించారు. ఏబీఎన్ టీవీ డిబేట్‌లో జగన్ మోహన్ రెడ్డి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ ఒంగోలు తాలుకా పోలీసు స్టేషన్లో శనివారం ఆయన ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అమరావతి రైతులకు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ద్రోహం గురించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన విమర్శలను కప్పిపుచ్చి, రైతుల దృష్టిని మరల్చే కుట్రలో భాగంగానే ఎల్లో మీడియాను రంగంలోకి దించారని ఆరోపించారు. జగనన్నను ఉద్దేశించి విషసర్పం అని కువిమర్శలు చేయడాన్ని తప్పుపట్టారు. వెన్నుపోటు రాజకీయాలు చేస్తుందెవరో, తటస్తుల పేరుతో టికెట్లను అమ్ముకున్నదెవరో, పార్టీల మార్పులను ప్రోత్సహించిందెవరో ప్రజలకు తెలుసని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీతో, ఢిల్లీలో బీజేపీతో ఒకేసారి ఇద్దరితో కాపురం చేస్తూ నీతిమాలిన రాజకీయాలు ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసున్నారు.
జర్నలిజం పేరుతో వ్యక్తిత్వ హననం:
భూ సేకరణ పేరుతో అమరావతి రైతులను మోసం చేస్తున్నారని చుండూరి మండిపడ్డారు. సొంత వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చేందుకు వేల ఎకరాలను దోచిపెడుతున్న చంద్రబాబు వైఖరిని ప్రశ్నించిన జగనన్నపై అక్కసుతో వ్యక్తిగత విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. జర్నలిజం పేరుతో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న ఎల్లో మీడియా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. ఐదేళ్ల కాలంలోనే రాష్ట్ర ప్రజలకు జగనన్న ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. కరోనా సమయంలో కోట్లాది మంది ప్రజలకు ఆరోగ్యాన్ని అందించారని, ఇంటింటికీ వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ పథకాలను అందించారని, గ్రామాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి పరిపాలనను ప్రజల ముంగిళ్లకు తీసుకెళ్లిన పాలనా దక్షకుడు జగనన్నను విమర్శించడం నైతికంగా దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. నిరుపేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలను, పేద బిడ్డలకు వైద్య విద్యను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారని, దాన్ని పూర్తి చేయడం చేతకాక పీపీపీ పేరుతో పేదప్రజలకు అన్యాయం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీయాలని హితవు పలికారు. మెడికల్ కళాశాలను కట్టడానికి డబ్బులు లేవని ఒట్టి చేతులు చూపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్టీఆర్ విగ్రహానికి రూ.1500 కోట్లు ఖర్చు పెట్టడానికి మాత్రం ఎక్కడ నుంచి వచ్చాయని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు న్యాయం చేయకుండా బడా కార్పొరేట్లకు 99 పైసలకే భూములు కట్టబెట్టడం ఎవడబ్బ సొమ్మని పంచుతారని ప్రశ్నించారు. రేపు మా ప్రభుత్వం రావడం ఖాయమని, అప్పుడు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.
వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏబీఎన్ చానల్ యాజమాన్యం, యాంకర్‌ల మీద కఠిన చర్యలు తీసుకొని చట్టం అందరికీ సమానమేనని నిరూపించాలని కోరారు. న్యాయవాది హరిబాబు మాట్లాడుతూ టీవీ డిబేట్ అనే సాకుతో మాజీ ముఖ్యమంత్రి జగనన్న మీద వ్యక్తిగత విమర్శలు చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు కటారి శంకర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజీవ్, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి రవణమ్మ, గౌడ్ విభాగం జిల్లా అధ్యక్షులు తాతా నరసింహ గౌడ్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు పల్నాటి రవీంద్ర, డివిజన్ అధ్యక్షులు మాల్యాద్రి రెడ్డి, శ్రీనివాసరావు, అమర్, పులసు సురేష్ , దేవా, అశోక్ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.


