కోడి పందేలపై ఎస్పీ కన్నెర్ర
ఒంగోలు టౌన్: సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కోడి పందేలకు బరులు సిద్ధం చేస్తున్న విషయంపై శనివారం ‘సాక్షి’ పత్రికలో వచ్చిన ‘పందెం కోడి – కయ్యానికి రెఢీ’ అనే కథనానికి ఎస్పీ హర్షవర్థన్ రాజు స్పందించారు. జిల్లా పోలీసు కార్యాలయం వద్ద ఆయన మాట్లాడుతూ జిల్లాలో కోడి పందేలు, పేకాట ఇతర జూదాలు వంటి అసాంఘిక కార్యకలాపాలను సహించేది లేదని స్పష్టం చేశారు. జిల్లాలోని పట్టణాలు, గ్రామాలు, శివారు ప్రాంతాల్లో కోడి పందేలు, జూదాలు, గుండాట నిర్వహించడం నిషేధమని తేల్చి చెప్పారు. ఎవరైనా కోడి పందేలు ఆడినా, ప్రోత్సహించినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో కోడి పందేలను కట్టడి చేయడానికి పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గతంలో కోడి పందేల్లో పట్టుబడిన వ్యక్తులను బైండోవర్ చేయాలని, పందేలు ఉపయోగించే కత్తులు తయారు చేసే వారు, వాటిని సరఫరా చేసేవారు, పందెం నిర్వహించేందుకు స్థలాలను కేటాయించే వారిని గుర్తించాలన్నారు. పండుగ రోజు కోడి పందాలు జరిగే ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయాలని చెప్పారు. ఎక్కడైనా కోడి పందాలు జరుగుతున్న సమాచారం తెలిస్తే వెంటనే పోలీసు వాట్సప్ నంబర్ 9121102266కు తెలియజేయాలని కోరారు.


