హామీలు నెరవేర్చకుంటే ఉద్యమం తీవ్రం
చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి అక్రమ కేసులు వెంటనే ఎత్తేయాలి వైఎస్సార్ సీపీ యువజన, విద్యార్థి విభాగ నాయకులు
ఒంగోలు సిటీ: ఎన్నికల ముందు మోసపు వాగ్దానాలతో గద్దెనెక్కిన చంద్రబాబు ప్రజలను నిట్టనిలువునా మోసం చేశారని, ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు గొంగటి శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా స్టూడెంట్ వింగ్ జిల్లా అధ్యక్షుడు పల్నాటి రవీంద్రారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోతల ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడు కరుణానిధి అన్నారు. యువజన, విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం ఒంగోలు నగరంలోని అంబేడ్కర్ భవనం నుంచి ప్రకాశం భవనం ముందు మెయిన్‌రోడ్డులోని అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి నినాదాలు చేసుకుంటూ నిరసన తెలిపారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని, నిద్ర లేపేందుకే నిరసనలు చేస్తున్నామని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంటు, మెడికల్ కళాశాలలు, నిరుద్యోగ భృతి వంటి ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చకుండా కల్లబొల్లి మాటలు చెప్పి కాలయాపన చేస్తోందని విమర్శించారు. స్వప్రయోజనాలపైనే దృష్టి పెడుతున్నారని, రాష్ట్ర ప్రజల అవసరాలను తీర్చడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. చంద్రబాబు మాటలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమన్నారు.
అక్రమ కేసులు ఎత్తేయాలి:
చంద్రబాబు ప్రభుత్వంలో అక్రమాలు, అరాచకాలను ఎవరైతే ప్రశ్నిస్తారో వారిపై కేసులు బనాయించి ఇబ్బందులు పెడుతున్నారని నాయకులు ధ్వజమెత్తారు. ఎవరైనా విద్యార్థి సంఘాల నాయకులు జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాల గురించి మాట్లాడితే వారిపై కేసులు, గంజాయి కేసులు, పీడీ యాక్ట్ పేరుతో కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే వాటిని భర్తీ చేయమంటే భర్తీ చేయకుండా ప్రశ్నించే గొంతుపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారన్నారు. విశాఖపట్నంలో విద్యార్థి నాయకులను అరెస్టు చేశారని, ప్రభుత్వం చేసే అక్రమాలపై ప్రశ్నించడమే మేము చేసిన తప్పా అని ప్రశ్నించారు. వెంటనే పెట్టిన కేసులను ఎత్తేయాలని, లేకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని గద్దె దించే వరకు పోరాడతామన్నారు. కార్యక్రమంలో ఒంగోలు టౌన్ ఏఐవైఎఫ్ కన్వీనర్ ఊటికొండ గోపి, రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శి పాకనాటి మనోహర్‌రెడ్డి, రాష్ట్ర యూత్ కార్యదర్శి చాగంరెడ్డి కృష్ణచైతన్యరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు మలిశెట్టి దేవా, సిటీ స్టూడెంట్ ప్రెసిడెంట్ మెట్టెల వెంకటేష్, ఒంగోలు నియోజకవర్గ స్టూడెంట్ ప్రెసిడెంట్ వేముల శ్రీకాంత్, సంతనూతలపాడు నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు అన్వేష్, స్టూడెంట్ వింగ్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గుంటక అంజిరెడ్డి, కనిగిరి, దర్శి, తాళ్లూరు, దర్శి, మార్కాపురం విద్యార్థి విభాగాల అధ్యక్షులు రాజశేఖరరెడ్డి, శ్రీనివాసరెడ్డి, కొర్రపాటి విష్ణుచౌదరి, వై.మహేందర్‌రెడ్డి, సంజీవ్‌రెడ్డి, విద్యార్థి నాయకులు చందు, శివరెడ్డి, గంగవరపు రిషి, లెనిన్, మరియదాసు తదితరులు పాల్గొన్నారు.
అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న యువజన, విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ సమితి నాయకులు


