ముమ్మరంగా ఏర్పాట్లు
మాజీ సీఎం జగన్‌ను ఆహ్వానించిన ఎమ్మెల్యే తాటిపర్తి
ఎడ్ల పందేలకు
యర్రగొండపాలెం: సంక్రాంతి పండుగ సందర్భంగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో స్థానిక పుల్లలచెరువు రోడ్డులోని పార్కుకు సమీపంలో ఉన్న స్థలంలో జాతీయ స్థాయి ఎడ్ల పందేలు నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈనెల 11 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించే ఎడ్లపందేలను తిలకించేందుకు రావాలని వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని ఎమ్మెల్యే, ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ తాడేపల్లికి వెళ్లి ఆహ్వాన పత్రిక అందజేశారు. 4 విభాగాలుగా జరిగే ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాల నుంచి ఎడ్లు పాల్గొంటున్నాయని నిర్వాహక కమిటీ తెలిపింది. ఈ ఎడ్ల పోటీలకు గాను వివిధ సైజుల్లో బండలను ఏర్పాటు చేశారు. సీనియర్ ఎద్దుల పోటీలకు 2100 కిలోలు, న్యూ కేటగిరీ ఎద్దుల పోటీలకు 1,500 కిలోలు, 6 పండ్ల ఎద్దుల విభాగం పోటీలకు 1,200 కిలోలు, 2 పండ్ల విభాగం పోటీలకు 800 కిలోల బరువున్న బండలను సిద్ధం చేశారు. ఒక్కో విభాగంలో 9 నగదు బహుమతులు అందజేయనున్నారు. ఎద్దుల విడిది కోసం టెంట్‌లు ఏర్పాటు చేశారు. పందేలు జరిగే సమయంలో ఎటువంటి తోపులాట, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఎద్దుల పోటీలను తిలకించేలా గ్యాలరీలు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా, రాష్ట్రంలో ఉన్న ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు అందజేస్తున్నారు. కాగా ఈ నెల 14వ తేదీన మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ మంత్రి ఆర్‌కే రోజా, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్.శ్యామల పర్యవేక్షిస్తారని వారు తెలిపారు.
ముమ్మరంగా ఏర్పాట్లు


