తెల్లరాయి అక్రమ మైనింగ్‌పై కొరడా
● అక్రమ మైనింగ్ క్వారీపై దాడులు
● వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలింపు
కందుకూరు: తెల్లరాయి అక్రమ మైనింగ్ కార్యకలాపాలపై ఎట్టకేలకు మైనింగ్‌శాఖ అధికారులు కదిలారు. శుక్రవారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన ‘తెల్లరాయి పచ్చని దోపిడీ’ కథనంపై స్పందించిన మైనింగ్ అండ్ విజిలెన్స్ శాఖ అధికారులు అక్రమ మైనింగ్ క్వారీపై దాడులు చేశారు. ఆశాఖ సహాయ సంచాలకుడు రామచంద్ర ఆధ్వర్యంలో అధికారుల బృందం వలేటివారిపాలెం మండలం పోలినేనిచెరువు గ్రామంలోని ప్రభుత్వ భూముల్లో సాగుతున్న తెల్లరాయి తవ్వకాలను అడ్డుకున్నారు. అక్కడ తవ్వకాలు చేస్తున్న భారీ వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి వాహనాలను వలేటివారిపాలెం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేశారా, క్వారీ వద్ద ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నారా లేదా వంటి విషయాలు బయటకు రావడం లేదు. ఈ దాడుల్లో ఎంత మందిని అదుపులోకి తీసుకున్నా, అక్రమ మైనింగ్ వెనుక ఉన్న అసలు సూత్రధారుల సంగతేంటి అనేది సస్పెన్స్‌గా మారింది. అదే సందర్భంలో దాడులకు వెళ్లిన మైనింగ్‌శాఖ అధికారులను అక్కడ నుంచి కదలకుండా అడ్డుకునే ప్రయత్నం పెద్దఎత్తున జరిగినట్లు సమాచారం. తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొన్న అధికారులు సాయంత్రానికి వాహనాలను వలేటివారిపాలెం పోలీస్ స్టేషన్‌కు చేర్చగలిగారు.
తెల్లరాయి అక్రమ మైనింగ్‌పై కొరడా


