ఎట్టకేలకు రామతీర్థం నీరు విడుదల
● 20 రోజుల అనంతరం మండలానికి రామతీర్థం నీరు
మర్రిపూడి: ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కనిగిరి, పామూరు, మర్రిపూడి, వెలిగండ్ల, సీఎస్‌పురం మండలాలకు రామతీర్థం జలాలు 20 రోజులుగా అందక తల్లడిల్లుతున్న తరుణంలో ‘మణులొద్దు మాణిక్యాలొద్దు..మంచినీళ్లు చాలు’ అన్న శీర్షికతో సాక్షి దినపత్రికలో కథనం గురువారం ప్రచురితమైంది. దీంతో ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ నాగేశ్వరరావు స్పందించారు. ఆయన ఆదేశాలతో 600 ఎంఎం జీఆర్‌పీ పైపులను కొన్ని లీకులను మరమ్మతులు చేయించి, మర్రిపూడి శివారులోని గ్రౌండ్ ఫ్లోర్ ట్యాంక్ నింపారు. అక్కడ నుంచి ఓవర్‌హెడ్ ట్యాంక్‌కు ఎక్కించి మండలంలోని 33 గ్రామాలకు గురువారం రామతీర్థం జలాలు సరఫరా చేశారు. పామూరు, కనిగిరి, సీఎస్‌పురం, వెలిగండ్ల మండలాలకు తాగునీరు సరఫరా చేయాల్సి ఉంది. మరో 5 రోజుల్లో పశ్చిమ ప్రాంతానికి పూర్తి స్థాయిలో రామతీర్థం జలాలు అందిస్తామని ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ జైపాల్ తెలిపారు.


