108 ఉద్యోగుల సమ్మె నోటీసు
ఒంగోలు టౌన్:
ప్రభుత్వం, యాజమాన్యం నిర్లక్ష్య వైఖరితో విసిగిపోయిన 108 ఉద్యోగులు అనివార్య పరిస్థితిలో సమ్మెకు వెళ్లనున్నట్లు గురువారం ప్రకటించారు. 108 ఉద్యోగులు ఎదుర్కొంటున్న అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం పలు దఫాలుగా వినతిపత్రాలు అందించినప్పటికీ ఎలాంటి స్పందన లేదని, దీంతో సమ్మెకు వెళ్తున్నామని 108 సర్వీసెస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ గురువారం ప్రకటించింది. ఇప్పటికే అనేక రూపాలలో నిరసన తెలియజేసినప్పటికీ యాజమాన్యం, ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. దాంతో అనివార్య పరిస్థితుల మధ్య ఈ నెల 12వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్లనున్నట్లు కమిటీ వివరించింది. సమ్మె కాలంలో ప్రజలకు కలిగే అసౌకర్యానికి యాజమాన్యమే బాధ్యత వహించాలని రాష్ట్ర కమిటీ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా 108 ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రకాశం, మార్కాపురం జిల్లాల కలెక్టర్‌కు వినతిపత్రాలు అందించినట్లు యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.గాలిరెడ్డి తెలిపారు. మార్కాపురం, ప్రకాశం జిల్లా అధికారులకు వినతిపత్రం అందించిన వారిలో యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సీహెచ్ భాస్కర్, ఒంగోలు డివిజన్ కార్యదర్శి బి.భాస్కర్, అధ్యక్షుడు దాసు దినేష్, పుల్లయ్య, పవన్ కుమార్, మార్కాపురం డివిజన్ ఉద్యోగులు ఎస్డీ వహాబ్, ఎన్.శ్రీనివాసులు, తిరుపతిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, ఎస్‌కే చాంద్ బాషా, ఎస్డీ మహమ్మద్ రఫీ, కాశీనాయక్, లక్ష్మయ్య, డి.శ్రీను, కె.చెన్నారావు, ఏ.శ్రీనివాసులు పాల్గొన్నారు.


