రవాణాశాఖపై సానుకూల దృక్పథం ముఖ్యం
ఒంగోలు సబర్బన్: ప్రజల్లో సానుకూల దృక్పథం పెరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు రవాణాశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం ఆర్‌టీఏ అధికారులతో ప్రకాశం భవనంలో ఆయన ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. వాహనాల ఫిట్నెస్, ఏటీఎస్, ఆర్‌సీ, లైసెన్స్‌ల జారీలో జాప్యంపై ఐవీఆర్‌ఎస్‌లో వ్యక్తమైన ప్రజల అభిప్రాయాల మీద సమావేశంలో చర్చించారు. డీటీసీ సుశీల వివరణ ఇస్తూ.. సాంకేతిక సమస్యలతో వివిధ పత్రాల జారీలో జాప్యం చోటుచేసుకుంటోందని చెప్పారు. వివిధ పత్రాల జాప్యంపై గ్రీవెన్స్‌లో నమోదైన అర్జీల గురించి రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామన్నారు. కలెక్టర్ స్పందిస్తూ.. జిల్లా స్థాయిలో రవాణాశాఖపై ప్రజల్లో సానుకూల దృక్పథం ఏర్పడేలా చూడాలన్నారు. క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహించే సిబ్బంది ప్రవర్తన కూడా ముఖ్యమన్నారు. సమావేశంలో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
రవాణా శాఖ
అధికారులతో సమీక్షిస్తున్న
కలెక్టర్
రాజాబాబు


