విద్యుత్ ఫీడర్లలో సాంకేతిక సమస్యలు అధిగమించాలి
ఒంగోలు సబర్బన్: విద్యుత్ లైన్లలోని ఫీడర్లలో సాంకేతిక సమస్యలు అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీసీపీడీసీఎల్ ఎస్‌ఈ కట్టా వెంకటేశ్వర్లు విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన గురువారం ఒంగోలు రామ్‌నగర్‌లోని విద్యుత్ భవన్ కాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించడం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. నాణ్యమైన విద్యుత్ అందించాలంటే ముఖ్యంగా ఫీడర్లలో సాంకేతిక సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. అందుకోసం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు కార్యాచరణ చేయాలని ఆదేశించారు. మరమ్మతులకు గురైన సాంకేతిక పరివర్తకాలను వెంటనే మార్చి వాటి పనితీరు మెరుగుపరచాలని సూచించారు. విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేస్తూ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. పరివర్తకాలు చోరీ కాకుండా ఏపీటీఎస్, స్థానిక పోలీసులు, గ్రామస్తుల సాయంతో గస్తీ కాస్తూ చోరీలను అరికట్టాలని దిశానిర్దేశం చేశారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు పీవీ.ఉషారాణి, పి. శ్రీనివాసులు, ఏపీటీఎస్ సీఐ, బిటీ.నాయక్, ఇతర విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
నాణ్యమైన విద్యుత్ అందించే విధంగా చర్యలు తీసుకోవాలి
విద్యుత్ శాఖ ఎస్‌ఈ కట్టా వెంకటేశ్వర్లు


