మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి
ఒంగోలు వన్‌టౌన్: విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియరల్ సివిల్ న్యాయమూర్తి షేక్ ఇబ్రహీం షరీఫ్ అన్నారు. నగరంలోని సంతపేటలో సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని గురువారం సందర్శించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ వ్యతిరేకంగా జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా కళాశాలలు, వసతి గృహాల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. బాల్య వివాహాల వల్ల అనర్థాలపై అవగాహన కల్పించారు. వివేకానంద జయంతి వారోత్సవాల్లో భాగంగా ఆయన మాటలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో వసతి గృహ నిర్వాహకులు అంకబాబు తదితరులు పాల్గొన్నారు.


