ఖర్చులకు డబ్బివ్వలేదని కసితీరా నరికాడు
బేస్తవారిపేట: మండల కేంద్రమైన బేస్తవారిపేటలో ఈ నెల 2వ తేదీన వృద్ధుడిని దారుణంగా హతమార్చిన కేసులో నిందితుడిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. బేస్తవారిపేట బీసీ కాలనీలోని ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్న జయంపు కృష్ణను తనతోపాటు ఉంటున్న మరో వ్యక్తి అత్యంత దారుణంగా నరికేసిన విషయం తెలిసిందే. ఇంటి ఖర్చులకు పింఛను డబ్బు ఇవ్వలేదన్న కారణంతోనే నిందితుడు హత్య చేసినట్లు మార్కాపురం డీఎస్పీ యు.నాగరాజు పేర్కొన్నారు. బుధవారం బేస్తవారిపేట పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వృద్ధుడి హత్య కేసుతోపాటు కంభం మండలం తురిమెళ్ల గ్రామంలో శ్రీగంధం చెట్ల నరికివేతకు పాల్పడిన నిందితుల వివరాలను డీఎస్పీ వెల్లడించారు. వివరాలు.. బేస్తవారిపేట మండలంలోని మోక్షగుండం గ్రామానికి చెందిన కొమరోలు చిన్న రంగయ్య బేస్తవారిపేట బీసీకాలనీలో ఓ గృహాన్ని అద్దెకు తీసుకుని ఏడాది కాలంగా ఒంటరిగా ఉంటున్నాడు. ఆరు నెలల క్రితం ఒంటరివాడైన జయంపు కృష్ణతో అతనికి పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి పొట్టేళ్ల వ్యాపారంతోపాటు మాంసం విక్రయిస్తుండేవారు. కృష్ణకు ఒకటో తేదీన వృద్ధాప్య పింఛను రూ.4 వేలు వచ్చాయి. ఇంట్లో సరుకులు లేవు, కొంత డబ్బు ఇవ్వాలని చిన్న రంగయ్య కోరగా కృష్ణ ఇవ్వలేదు. ‘రోజూ నా డబ్బులతో వండిపెడితే తింటున్నావు పింఛను వచ్చింది కదా ఇప్పుడైనా డబ్బులివ్వు’ అని రంగయ్య గట్టిగా అడిగాడు. ఈ క్రమంలో ఉదయం, సాయంత్రం ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో గాఢ నిద్రలో ఉన్న కృష్ణపై పొట్టేళ్లు నరికే కత్తితో రంగయ్య దాడి చేశాడు. తల భాగం, చేతులపై నరకడంతో తీవ్ర రక్తస్రావంతో కృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. బుధవారం బీసీ కాలనీ పరిసరాల్లో నిందితుడు చిన్న రంగయ్యను పోలీసులు అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో కంభం సీఐ మల్లికార్జున, ఎస్సైలు ఎస్‌వీ రవీంద్రారెడ్డి, శివకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
వృద్ధుడి హత్య కేసులో విస్తుపోయే
వాస్తవం వెలుగులోకి..
పింఛను సొమ్మును ఇంటి ఖర్చులకు అడిగిన సహచరుడు
హత్యకు కొద్ది గంటల ముందు ఇద్దరి మధ్య వాగ్వివాదం
వివరాలు వెల్లడించిన మార్కాపురం
డీఎస్పీ నాగరాజు


