ప్రభుత్వ నిధులతో పనులు.. పచ్చ నేత ఫోజులు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ నిధులతో పనులు.. పచ్చ నేత ఫోజులు

Jan 8 2026 9:30 AM | Updated on Jan 8 2026 9:30 AM

ప్రభుత్వ నిధులతో పనులు.. పచ్చ నేత ఫోజులు

ప్రభుత్వ నిధులతో పనులు.. పచ్చ నేత ఫోజులు

యర్రగొండపాలెం: అధికారం ఉందన్న అహంకారంతో పచ్చనేతలు మిడిసి పడుతున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో చేపడుతున్న పనులకు తామే విరాళాలు ఇచ్చినట్లు ఫోజులు కొడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓటమి పాలైన టీడీపీ నాయకుడు గూడూరి ఎరిక్షన్‌బాబు ఎటువంటి హోదా లేకపోయినా శిలాఫలకాలు ఆవిష్కరిస్తూ దర్పం ప్రదర్శిస్తున్నారు. టీడీపీలోని తన వర్గం నాయకులతోపాటు కొందరు అధికారులు చేస్తున్న భజనతో ఉబ్బితబ్బుబ్బవుతున్న ఎరిక్షన్‌బాబు ప్రభుత్వం తమదే కదా ఏమి చేసినా చెల్లుతుందని భావిస్తున్నట్టుగా ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు. రెవెన్యూ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే పంపిణీ చేయాల్సిన పట్టాదారు పాస్‌ పుస్తకాలను సైతం ఎరిక్షన్‌బాబు చేతులమీదుగా అందించి ప్రొటోకాల్‌కు తిలోదకాలిచ్చారు. ఈ క్రమంలో అధికారులు ఏర్పాటు చేసిన గ్రామ సభలు టీడీపీ సమావేశాలకు ఏమాత్రం తీసిపోవడం లేదన్న విమర్శలున్నాయి. వేదికలపై టీడీపీ నేతలను చూసిన రైతులు వచ్చిన దారినే వెనుదిరగడంతో గ్రామ సభలు వెలవెలబోయాయి. అన్ని వర్గాలకు చెందిన రైతులు తమ పట్టాదారు పాస్‌ పుస్తకాలను ఇప్పటికీ తీసుకోకపోవడం గమనార్హం.

ఏ హోదా ఉందని..

బుధవారం పెద్దదోర్నాల మండలంలోని పెద్ద బొమ్మాలాపురం పంచాయతీలో పీఆర్‌, ఐటీడీఏ, ఎఫ్‌డీఆర్‌ నిధులతో మంజూరైన పలు అభివృద్ధి పనులకు ఎరిక్షన్‌బాబు శంకుస్థాపన చేయడం వివాదాస్పదంగా మారింది. ఇప్పటి వరకు నియోజవర్గంలోని పలు పంచాయతీల్లో పనులకు కేవలం భూమి పూజతో సరిపెట్టుకున్నారు. ఇది కూడా తప్పిదమే అని ప్రశ్నించే వారు లేకపోవడంతో శిలాఫలకాలు వేసుకోవడం, వాటిపై తమ పేర్లు లిఖించుకోవడం వరకు పరిస్థితి వచ్చింది. వైఎస్సార్‌ సీపీ హయాంలో నిర్మించి, ప్రారంభించిన పెద్దదోర్నాల మండల పరిషత్‌ కార్యాలయాన్ని ఎరిక్షన్‌బాబు మరోసారి రిబ్బన్‌ కట్‌ చేయడం విడ్డూరంగా ఉందని ప్రజలు విమర్శిస్తున్నారు. గత ప్రభుత్వ కాలంలో పూర్తయిన ఆ భవనాన్ని ఎంపీపీ గుమ్మా పద్మజ ఎల్లేష్‌ యాదవ్‌ ప్రారంభించారు. సెంటిమెంట్‌ కారణాలతో కొత్త భవనంలోకి అధికారులు ఇంకా మారలేదు. దీనిని ఆసరాగా తీసుకున్న పంచాయతీరాజ్‌ శాఖ అధికారి ఒకరు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎంపీడీఓ కార్యాలయ భవనంతోపాటు పెద్ద బొమ్మలాపురంలో శంకుస్థాపన కార్యక్రమానికి ఆ అధికారే పూర్తి స్థాయిలో ఖర్చుపెట్టి స్వామి భక్తిని చాటుకున్నారని విమర్శలు వినవస్తున్నాయి. పెద్ద బొమ్మలాపురంలో శిలాఫలకంపై ‘ఇట్లు తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ’ అని రాయించడాన్ని చూసి గ్రామస్తులు ముక్కున వేలేసుకున్నారు.

భజన బృందం డైరెక్షన్‌లో ఎరిక్షన్‌ యాక్షన్‌

ఏ హోదా లేని వ్యక్తితో శిలాఫలకాల ఆవిష్కరణలు

పెద్దదోర్నాల ఎంపీడీఓ కార్యాలయంలో ‘చెల్లికి మళ్లీ పెళ్లి’ సీన్‌ రిపీట్‌

పెద్దబొమ్మలాపురంలో శిలాఫలకంపై ‘ఇట్లు టీడీపీ గ్రామ కమిటీ’ లిఖింపు

భారీ ఎత్తున అయిన ఖర్చంతా స్వామి భక్తి చాటుకున్న పీఆర్‌ అధికారిదే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement