ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య
గిద్దలూరు రూరల్: మండలంలోని దేవనగరం గ్రామంలో వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన నిడికంటి రామకృష్ణ(42) కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో మంగళవారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గిద్దలూరు వైద్యశాలకు తరలించారు. మృతునికి భార్య, ఇద్దరుకుమారులు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కె.సురేష్ తెలిపారు.
గిద్దలూరు రూరల్: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన ముగ్గురికి 100 రోజుల జైలుశిక్ష రూ.15 వేల జరిమానా, 6 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్సు రద్దు చేస్తూ జడ్జి కె.భరత్‌చంద్ర తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళితే..సీఐ కె.సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో మందు తాగి వాహనం నడుపుతూ ముగ్గురు పట్టుబడ్టారు. వారిని జడ్జి ముందు హాజరు పరచగా జైలుశిక్ష, జరిమానా విధించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
టంగుటూరు: ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొనగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని కాకుటూరివారిపాలెంలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..కాకుటూరివారిపాలెం గ్రామానికి చెందిన బెజవాడ శ్రీకాంత్, కౌటిల్య ఇద్దరూ టంగుటూరు నుంచి స్వగ్రామానికి పోతుండగా వెనుక నుంచి జయవరం గ్రామానికి చెందిన వసంత్ ప్రమాదవశాత్తు కారుతో వెనక నుంచి బలంగా ఢీకొనగా ద్విచక్ర వాహనదారులకు శ్రీకాంత్, కౌటిల్య తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు, కారు నడుపుతున్న వసంత్ స్వల్ప గాయాలు కాగా ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. ప్రమాదంలో రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగమళ్లీశ్వరరావు తెలిపారు.
ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య


