విద్యార్థి యువజన నాయకులపై రౌడీషీట్లా...?
ఒంగోలు టౌన్: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రశ్నిస్తున్న విద్యార్థి యువజన సంఘాల నాయకుల మీద అక్రమంగా కేసులు బనాయించి రౌడీషీట్లు పెట్టడం అన్యాయమని వైఎస్సార్ సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముల్లంగి రవీంద్రారెడ్డి, ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.ప్రభాకర్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ పవన్ కళ్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. స్థానిక మల్లయ్యలింగం భవనంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ...మీ ఆస్తులు అడగడం లేదు, ఎన్నికల ప్రచారంలో మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాత్రమే అడుగుతున్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చాలు కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారని, కేసులు, జైళ్లతో విద్యార్థి యువజన నాయకులను అణిచివేయలేరని తేల్చిచెప్పారు. రాష్ట్రంలో ప్రజా పరిపాలనకు బదులుగా రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న విద్యార్థి నాయకుల మీద కేసులు ఎందుకు పెడుతున్నారో మంత్రి లోకేష్ చెప్పాలని నిలదీశారు. విశాఖపట్నంలో విద్యార్థి యువజన సంఘాల నాయకుల మీద పెట్టిన రౌడీషీట్‌లను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి యువజన నాయకులు మీకు రౌడీ షీటర్లుగా కనిపించడం బాధాకరమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన నాయకుల మీద అక్రమంగా బనాయించిన కేసులను, రౌడీ షీట్లను ఎత్తివేయాలని కోరారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం ఒంగోలు నియోజకవర్గ అధ్యక్షుడు వేముల శ్రీకాంత్, కొత్తపట్నం మండల అధ్యక్షుడు దొరం హేమంత్ రెడ్డి, ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు లెనిన్ బాబు పాల్గొన్నారు.
రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న నారా లోకేష్
కేసులు, జైళ్లతో ప్రశ్నించే నాయకులను
అణిచివేయలేరు
వైజాగ్‌లో విద్యార్థి నాయకుల మీద బనాయించిన అక్రమ కేసులు ఎత్తివేయాలి
వైఎస్సార్ సీపీ విద్యార్థి యువజన విభాగం, ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకుల డిమాండ్


