విమానాల ఎమర్జెన్సీ ల్యాండింగ్ రన్‌వేకు మరమ్మతులు
సింగరాయకొండ: విమానాల ఎమర్జెన్సీ ల్యాండింగ్ రన్‌వేకు జాతీయ రహదారి అధికారులు మరమ్మతులు చేపట్టారు. ఈ ప్రాజెక్టును దక్కించుకున్న కేఎంసీ కంపెనీ 2020 జనవరిలో సుమారు రూ.52.38 కోట్ల అంచనా వ్యయంతో 3.60 కిలోమీటర్ల దూరం రన్‌వే పనులు ప్రారంభించగా కాల పరిమితి 5 సంవత్సరాలు విధించారు. ఈ నెలతో కాంట్రాక్టు గడువు ముగుస్తుండటంతో సదరు కాంట్రాక్టు దక్కించుకున్న కేఎంసీ కంపెనీ జాతీయ రహదారి అధికారుల సూచనలతో మరమ్మతు పనులు చేపట్టింది. వాస్తవానికి సిమెంటు రోడ్డు కాలపరిమితి సుమారు 20 ఏళ్లు ఉంటుంది. కానీ మొదటి నుంచి విమానాల ఎమర్జెన్సీ ల్యాండింగ్ రన్‌వే పనులు నాశిరకంగా చేయటంతో సిమెంటు రోడ్డు చాలా చోట్ల దెబ్బతిని అనేక రోడ్డు ప్రమాదాలు జరగటంతో పాటు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. రన్‌వే ప్రాజెక్టు కాలపరిమితి పూర్తి కావస్తుండటంతో సదరు కాంట్రాక్టరు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టినట్లు జాతీయ రహదారి అధికారులు వివరించారు.


