బాఽధితులకు సత్వర న్యాయం అందిస్తాం
● ఎస్పీ హర్షవర్ధన్‌రాజు
మార్కాపురం: న్యాయంకోసం పోలీసుల వద్దకు వచ్చే బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యమని ఇన్‌చార్జి ఎస్పీ వి.హర్షవర్ధనరాజు అన్నారు. స్థానిక స్థానిక ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొని అర్జీలు స్వీకరించారు. మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాలకు చెందిన 48 మంది నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. వారితో ముఖాముఖిగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. భూ వివాదాలు, కుటుంబ కలహాలు, మోసాలకు సంబంధించిన పిటిషన్లు ఉన్నాయి. ఆయా ఫిర్యాదులపై ఇన్‌చార్జి ఎస్పీ సంబంధిత స్టేషన్ అధికారులతో మాట్లాడి వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించరాదని హెచ్చరించారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చే వృద్ధులు, నడవలేని పరిస్థితుల్లో ఉన్న వారి సమస్యలను ప్రత్యేకంగా పరిగణలోనికి తీసుకుని సంఘటనా స్థలాలను సందర్శించి చట్టప్రకారం సత్వర న్యాయం అందించాలని ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలను భయపడకుండా నేరుగా పోలీసు అధికారులకు తెలపవచ్చని చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ఎక్కువగా చీటింగ్, ఆర్థిక తగాదాలు, భూ తగాదాలపై ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ కార్యాలయ సిబ్బంది తెలిపారు. డీఎస్పీ నాగరాజు, మార్కాపురం, త్రిపురాంతకం సీఐలు సుబ్బారావు, అసం, గిద్దలూరు రూరల్, పొదిలి సీఐలు రామకోటయ్య, రాజేష్‌కుమార్, ఎస్సైలు పాల్గొన్నారు.


