పరిసరాల పరిశుభ్రతతో వ్యాధులు దూరం
● మార్కాపురం ఇన్‌చార్జి కలెక్టర్ రాజాబాబు
మార్కాపురం రూరల్ (మార్కాపురం): పరిసరాల పరిశుభ్రతతో వ్యాధులు దూరమవుతాయని, ప్రజలు పరిశుభ్రతపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని మార్కాపురం జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ పి. రాజాబాబు ప్రజలకు తెలిపారు. మార్కాపురం మండలం తిప్పాయిపాలెంలో సోమవారం వికసిత భారత్ రాంజీ చట్టంపై గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ చట్టం కింద గ్రామస్థాయిలో చేపట్టే అభివృద్ధి పనులను తెలయచేసేలా గ్రామసభలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో గ్రామసభలు జరుగుతాయన్నారు. స్వచ్ఛ సంక్రాంతి పేరుతో విస్తృత స్థాయిలో కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే పరిసరాల స్వచ్ఛత, ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ అన్నారు. ప్రతి నెలా పరిసరాల శుభ్రతపై ప్రత్యేక ఇతివృత్తంగా కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. ప్రజలు తమతో పాటు ఇంటి పరిసరాలను కూడా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, ఎంపీపీ లక్ష్మీదేవి కృష్ణారెడ్డి, డీపీఓ వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈఓ చిరంజీవీ, డ్వామా పీడీ జోసఫ్‌కుమార్, ఇన్‌చార్జి సబ్‌కలెక్టరు శివరామిరెడ్డి, సర్పంచ్ కుమారి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఫొటో ఎగ్జిబిషన్‌ను కలెక్టరు పరిశీలించారు.


