నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలి
● జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మానాయక్
మార్కాపురం: మార్కాపురం జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహ విద్యార్థులు పదో తరగతిలో నూరుశాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్ లక్ష్మానాయక్ వార్డెన్‌లను ఆదేశించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం మార్కాపురం, బేస్తవారిపేట, గిద్దలూరు, కనిగిరి డివిజన్ల పరిధిలోని 44 వసతి గృహాల ఏఎస్‌డబ్ల్యూ, హెచ్‌డబ్ల్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశామని, ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వంద రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను పక్కాగా అమలుచేయాలన్నారు. హాస్టల్ విద్యార్థులకు ప్రతి నెలా వైద్యులతో క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. సమావేశంలో ఏఎస్‌డబ్ల్యూ రామకృష్ణారెడ్డి, వార్డెన్లు పాల్గొన్నారు.


