పందెం బరి సిద్ధం..
ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
యర్రగొండపాలెం: సంక్రాంతి పండుగ సందర్భంగా ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ పర్యవేక్షణలో ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించే జాతీయ స్థాయి ఎడ్ల పందేల కోసం గ్రౌండ్‌ను సిద్ధం చేశారు. ఈ పోటీలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఆయన స్వయంగా అన్ని ఏర్పాట్లను చూస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు, వివిధ విభాగాల నాయకులను కలిపి కమిటీలుగా ఏర్పాటు చేసి ఆయా పనులు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. వివిధ ప్రాంతాల్లో జాతీయ స్థాయిలో జరిగే పందేల్లో పాల్గొన్న ఎడ్లు ఈ పోటీల్లో కాలు దువ్వి రంకెలు వేయనున్నాయి. ఏపీ రాష్ట్రంతోపాటు తెలంగాణ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుంచి ఎడ్లు వచ్చి నియోజకవర్గ ప్రజలకు కనువిందు చేయనున్నాయి. ఒంగోలు పశు ప్రోత్సాహక కమిటీ వారు ఒంగోలు జాతి ఎద్దుల పోటీలు నిర్వహిస్తుండేవారు. 20 ఏళ్ల క్రితం నిలిచిపోయిన ఈ ఎడ్ల పోటీలు ప్రస్తుతం మార్కాపురం జిల్లాలోని నియోజకవర్గ కేంద్రమైన యర్రగొండపాలెంలో నిర్వహించడంపై ఈ ప్రాంతవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పోటీలు సీనియర్, న్యూ కేటగిరీ, 6 పండ్లు, 2 పండ్ల విభాగాలుగా విభజించి పశుపోషకులను ఆహ్వానిస్తున్నారు. ఒక్కొక్క విభాగంలో 9 నగదు బహుమతులను నిర్వాహకులు ప్రకటించారు. మొత్తం రూ.14.85 లక్షల బహుమతుల్లో అన్ని విభాగాల్లో ప్రథమ, ద్వితీయ బహుమతులు భారీ మొత్తంలో ఉండటం వలన పశు పోషకులు తమ ఎడ్లతో పెద్ద ఎత్తున ఈ పోటీల్లో పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అన్ని ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండేలా స్థానిక పుల్లలచెరువు రోడ్డులోని పార్కుకు సమీపంలో ఉన్న దాదాపు 10 ఎకరాల స్థలంలో పోటీలను ఏర్పాటు చేస్తున్నారు. ఎడ్ల పందేలు వీక్షించేందుకు వచ్చే మహిళలకు ప్రత్యేక స్థలాన్ని కేటాయించేలా చూస్తున్నారు. పోటీలు జరిగే గ్రౌండ్‌కు సమీపంలోనే తమ ఎడ్లను సురక్షితంగా ఉంచుకునేందుకు ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ పుష్కలంగా నీరు ఉండేలా ట్యాంకర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఎద్దులతో పాటు వచ్చే పశుపోషకులు, రైడర్లకు, ఎడ్ల పందేలు వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారందరికీ భోజన వసతులు కల్పిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రత్యేక నిఘా ఏరా్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.


