ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత
ఒంగోలు టౌన్: ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు కలెక్టర్ పి.రాజాబాబు తెలిపారు. సోమవారం ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ చాంబర్లో 16వ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. కమిటీ చైర్మన్ కూడా అయిన కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో రోగులకు మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వివరించారు. రూ.10 కోట్లతో జీజీహెచ్‌కు నూతన హంగులు కల్పించనున్నట్లు చెప్పారు. సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జీజీహెచ్‌లో మంచినీటి సమస్య పరిష్కారానికి ఓవర్ హెడ్ ట్యాంక్‌తో పాటుగా రోగుల కోసం వెయిటింగ్ హాల్, నూతన ఓపీ, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలకు సమావేశం ఆమోదం తెలిపింది. ధోబీ మిషన్ కొనుగోలు, పేషంట్ల రద్దీ కారణంగా ఫిజియోథెరపిస్ట్ నియామకానికి ఆమోదం తెలిపింది. నర్సింగ్ స్కూలు, కాలేజీ విద్యార్థుల వసతి కోసం కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సెక్యూరిటీ, పారిశుధ్యం విషయంలో నిర్లక్ష్యం వీడాలని, రోజు వారీ తనిఖీలు నిర్వహించి నివేదిక ఇవ్వాలని కమిటీలో నిర్ణయించారు. జీజీహెచ్ ఆవరణలోని షాపింగ్‌లను క్రమబద్ధీకరించి నిబంధనల మేరకు అద్దెలు వసూలు చేయాలని, ఆక్సిజన్, స్టేషనరీ సరఫరాను సమీక్షించాలని నిర్ణయించారు. వైద్యులు, సిబ్బంది విధులు సరిగా నిర్వహించేలా చూడాలని, నిత్యం తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. విధులకు హాజరుకానీ ఎంఎన్‌ఓ, ఎఫ్‌ఎన్‌ఓలను తొలగించి కొత్త వారిని తీసుకునేందుకు ఆమోదం లభించింది. సమావేశంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, సూపరింటెండెంట్ డా.మాణిక్యరావు, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ టి.వెంకటేశ్వర్లు, డిప్యూటీ సూపరింటెండెంట్లు నామినేని కిరణ్, తిరుపతి రెడ్డి, ఏడుకొండలరావు, ఆర్‌ఎంఓ మాధవీలత, ఏడి అనిల్ కుమార్ రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు.


