హైస్కూళ్లు, కాలేజీల వద్ద పోలీసుల నిఘా
విద్యార్థినులతో అనుచితంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న ఎస్పీ
ఒంగోలు టౌన్: జిల్లాలోని మహిళలు, బాలికలపై వేధింపులు ఎక్కువయ్యాయంటూ ‘నారా వారి పాలనలో నారీ విలాపం’ అన్న శీర్షికన సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఎస్పీ హర్షవర్ధన్‌రాజు స్పందించారు. జిల్లా వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల వద్ద నిఘా పటిష్టం చేశారు. జిల్లాలోని అన్నీ హైస్కూళ్లు, కాలేజీల వద్ద ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం గం.5.30 వరకు డ్రోన్ కెమెరాలతో పోలీసులు పహారా కాశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థినులు స్కూళ్లకు, కాలేజీలకు వెళ్తున్న సమయంలో ఆకతాయిలు అల్లర్లు చేస్తే భరతం పట్టేందుకు ఆకాశ మార్గాన నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ర్యాగింగ్, ఈవ్ టీజింగ్‌లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థినుల పట్ల ఎవరైనా అమర్యాదగా వ్యవహరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లలను స్కూళ్లలో విడిచే సమయంలో పరిసరాలను గమనించాలని చెప్పారు. ఎవనరైనా అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల వద్ద రోడ్డు కనపడేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని యాజమాన్యాలకు సూచించారు. విద్యార్థులు స్కూలుకు వచ్చే సమయానికి అర్ధగంట ముందు పరిసరాలను గమనించాలన్నారు. కాలేజీల వద్ద కానీ, స్కూళ్ల వద్దకానీ ఎవరైనా అల్లర్లు చేసినా, విద్యార్థినులను ఇబ్బందులు పెట్టినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
హైస్కూళ్లు, కాలేజీల వద్ద పోలీసుల నిఘా


