అర్జీలను సత్వరం పరిష్కరించాలి
ఒంగోలు సబర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను సత్వరం పరిష్కరించాలని ఈ దిశగా ప్రత్యేక దృష్టి సారించాలని ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ చిన ఓబులేసు అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం ఒంగోలు కలెక్టరేట్ లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కుమార్, కళావతి, విజయజ్యోతి, మాధురిలతో కలసి పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి జేసీ మాట్లాడుతూ వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులకు సూచించారు. జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఎంతో ఆశతో అర్జీదారులు వస్తారని, వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారుడు సంతృపిత్ చెందేలా నిర్ణీత గడువులోపు పరిష్కరించాలన్నారు. వచ్చిన అర్జీలపై సంబంధిత శాఖల జిల్లా అధికారి కచ్చితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో 329 వినతులు వచ్చాయి. కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.


