సీపీఐ వందేళ్ల పండుగను విజయవంతం చేయండి
● సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు అజయ్ కుమార్
ఒంగోలు టౌన్: తెలంగాణలోని ఖమ్మంలో ఈ నెల 18వ తేదీ నిర్వహించనున్న సీపీఐ వందేళ్ల పండుగను విజయవంతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జంగాల అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. స్థానిక మల్లయ్యలింగం భవనంలో ఆదివారం సీపీఐ ఉమ్మడి ప్రకాశం జిల్లా కార్యవరర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సయ్యద్ మౌలాలి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో కీలకపాత్ర పోషించడమే కాకుండా స్వాతంత్య్రానంతరం దేశంలోని బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అండగా అనేక పోరాటాలు చేసిన ఘనత సీపీఐకు దక్కుతుందని తెలిపారు. అధికారం కోసం పాకులాడకుండా నిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి పాటుపడిందన్నారు. అందుకే అఽధికారంలో లేకపోయినప్పటికీ వందేళ్లుగా దేశ ప్రజలు సీపీఐని ఆదరిస్తున్నారని తెలిపారు. స్వాతంత్య్ర పోరాటంతో ఎలాంటి సంబంధం లేని బీజేపీ.. ఏనాడూ ప్రజల సమస్యల కోసం పాటుపడని బీజేపీ.. నేడు పరిపాలన చేస్తోందని, దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు బరితెగిస్తోందని విమర్శించారు. దశాబ్దాల క్రితం ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న కార్మికుల హక్కులను కాలరాస్తోందని, దేశానికి పట్టెడన్నం పెట్టే రైతన్నలకు గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా నల్లచట్టాలతో వ్యవసాయాన్ని మరింత సంక్షోభంలోకి నెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ 12 ఏళ్ల పాలనలో ఒక్క ప్రభుత్వరంగ సంస్థను కూడా తీసుకురాలేదని, దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ అదానీ, అంబానీలకు అప్పగిస్తున్నాడని ధ్వజమెత్తారు. మోదీ పాలనలో దళితులు, వెనకబడిన వర్గాలు, మహిళలు, మైనార్టీలపై దాడులు పెచ్చుమీరిపోయాయని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే వారిని జైలుకు పంపిస్తున్నారని, వారి ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ పాలన మీద పోరాటాలకు ప్రజలు సిద్ధం కావాలన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, సహాయ కార్యదర్శి ఆర్.వెంకటరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు నల్లూరి మురళి, ఆర్.రామకృష్ణ, ఎం.విజయ, ఆర్.లక్ష్మి, ఎస్‌కే ఖాశీం, డి.శ్రీనివాస్, ఎం.రమేష్, కొత్తకోట వెంకటేశ్వర్లు, వి.హనుమారెడ్డి, శ్రీరాం శ్రీనివాసరావు, కరుణానిధి తదితరులు పాల్గొన్నారు.


