అమెరికా కండకావరాన్ని ఖండించాలి
ఒంగోలు టౌన్: అంతర్జాతీయ న్యాయసూత్రాలను ఉల్లంఘిస్తూ దక్షిణమెరికాలోని వెనిజులా దేశంపై దాడి చేయడమే కాకుండా ఆ దేశాధ్యక్షుడిని బంధించి తీసుకెళ్లడం అమెరికా కండకావరానికి నిదర్శనమని, ప్రజాస్వామికవాదులంతా ఈ దుర్మార్గాన్ని తీవ్రంగా ఖండించాలని సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి సీఎస్ సాగర్ పిలుపునిచ్చారు. వెనిజులాపై అమెరికా దాడులను ఖండిస్తూ ఆదివారం స్థానిక కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ రెండు రోజులుగా వెనిజులా దేశంపై అమెరికా మారణాయుధాలతో దాడులు చేసి సామాన్యులను సైతం హతమార్చడం కిరాతకమన్నారు. ఆయిల్ నిక్షేపాలను సొంతం చేసుకోవాలన్న కుట్రతో ట్రంప్ రౌడీయిజానికి పాల్పడుతున్నాడని, వెనిజులా సార్వభౌమత్వాన్ని గౌరవించకుండా నేరుగా జోక్యం చేసుకోవడం ప్రపంచ న్యాయ సూత్రాలను ఉల్లంఘించడమేనని అన్నారు. పాలస్తీనా భూ భాగంలో వేలాది మంది పసిపిల్లలను క్రూరంగా హత్య చేసిందన్నారు. అమెరికా దాష్టికాలపై భారత దేశం స్పందించాలని, వెంటనే పార్లమెంటును సమావేశపరిచి వెనిజులా ఘటనను ఖండించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘ రాష్ట్ర నాయకురాలు బి.పద్మ, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్.రాజశేఖర్, చొప్పర జాలన్న, పద్మ, హనుమంతరావు, దారా సుబ్బారావు, దాసరి వెంకటేష్, సి.తిరుమలరావు పాల్గొన్నారు.


