జనగణనలో కులగణన నిర్వహించాలి
● బీసీ సమన్వయ కమిటీ చైర్మన్ బొట్లా సుబ్బారావు
ఒంగోలు వన్‌టౌన్: జనగణనలో కులగణన నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీసీ సమన్వయ కమిటీ చైర్మన్ బొట్లా సుబ్బారావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో సావిత్రీబాయి ఫూలే జయంతి కూడా నిర్వహించి ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ బీసీలకు జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగాలలో, స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్లు కల్పించాలన్నారు. 2024 ఎన్నికలలో కూటమి నాయకులు ఇచ్చిన హామీ మేరకు బీసీ రక్షణ చట్టాన్ని తక్షణమే చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయాలన్నారు. కూటమి ప్రభుత్వ హామీలలో ఒకటైన 50 సంవత్సరాలు నిండిన బీసీలకు వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వాలని, 18 సంవత్సరాలు నిండిన మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెలా రూ.1,500 ఇవ్వాలని, యువతకు నిరుద్యోగ భృతి రూ.3,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో 2010 యూనిట్లకు బీసీలను గుర్తించి మంజూరు చేయకుండా, సబ్సిడీ డబ్బులు బ్యాంకులకు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని, తక్షణమే నిధులు మంజూరు చేసి బీసీలకు యూనిట్లు మంజూరు చేయాలి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు చావలి సుధాకర్ మాట్లాడుతూ 1931లో బ్రిటిష్ ప్రభుత్వంలో చివరిసారిగా కులగణన జరిగిందని, తక్షణం కులగణన చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర నాయకులు ధరణికోట లక్ష్మీనారాయణ, బొట్ల రామారావు, రాష్ట్ర కన్వీనర్ అజీజ్, జిల్లా కన్వీనర్ గుంటూరి మస్తాన్‌రావు, బీసీ సెల్ నగర అధ్యక్షుడు ఫణిదపు సుధాకర్, రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ పేరయ్య, సీపీఐ రెడ్‌స్టార్ నాయకుడు భీమవరపు సుబ్బారావు, గిరిజన సమన్వయ కమిటీ రాష్ట్ర నాయకుడు పేరం సత్యం, ఉడుతా మంత్రాలు, బీసీ నాయకురాలు శేషమ్మ, దేవరంపాటి శ్రీదేవి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షురాలు దూళ్ల దుర్గాభవాని, అప్పారావు, రజక నాయకుడు ఉప్పలపాటి వేణు, బీసీ నాయకుడు బొట్లా మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.


