సీజనల్ వ్యాధులపై జీవాల పెంపకందారులకు అవగాహన
కనిగిరిరూరల్: నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో శుక్రవారం పశు వైద్యాధికారులు, సిబ్బంది పర్యటించారు. ‘మూగ జీవాల మృత్యు ఘోష’ శీర్షికన ‘సాక్షి’లో శుక్రవారం ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. కనిగిరి ఏడీఏహెచ్ గజ్జల శ్రీనివాసులరెడ్డి ఆదేశాలతో అన్ని మండలాల్లో పశువైద్యాధికారులు, వైద్య సిబ్బంది క్షేత్ర స్థాయిలో పర్యటించారు. జీవాలు, పశుకాపరులతో మాట్లాడారు. జబ్బున పడ్డ గొర్రెలు, మేకలను పరిశీలించి సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. జీవాలను బహిరంగ ప్రదేశాల్లో ఉంచడం వల్ల చలి కాలంలో జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని వివరించారు. నట్టల నివారణ మందు, టీకాలను సకాలంలో వేయించుకోవాలని సూచించారు. పశు వైద్య కేంద్రాల్లో ఉన్న మందులను అవసరమైన రైతు సేవా కేంద్రాలకు పంపిణీ చేయించి, చికిత్స చేయిస్తామని ఏడీఏహెచ్ వెల్లడించారు. క్షేత్ర స్థాయి పరిశీలనలో కంచర్లవారిపల్లి వైద్యుడు కె.రాజశేఖర్‌రెడ్డి, పశు వైద్యాధికారులు, పశువర్ధక శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
మార్కాపురం: మార్కాపురం జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజాబాబు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో జాతీయ రహదారి భద్రతా క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో రహదారి ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈనెల 1 నుంచి 31వ తేదీ వరకు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాన్ని నిర్వహించాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వాహనదారులు, ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. డీఆర్‌ఓ ఓబులేష్, ఇన్‌చార్జి సబ్‌కలెక్టర్ శివరామిరెడ్డి, రవాణాశాఖాధికారి సుశీల, పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, మార్కాపురం ఆర్టీఓ శ్రీ చందన, డీఎంహెచ్‌ఓ వెంకటేశ్వర్లు, ఎంవీఐ మాధవరావు, తహసీల్దార్ చిరంజీవి, కమిషనర్ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులపై జీవాల పెంపకందారులకు అవగాహన


