చంద్రబాబుకు పీడీ యాక్ట్ వర్తించదా ?
ఒంగోలు టౌన్: ప్రజలవాణి వినిపించిన సీపీఎం నాయకుడు అప్పలరాజుపై రాష్ట్ర ప్రభుత్వం పీడీ యాక్ట్ ప్రయోగించడం దారుణమని సుప్రీంకోర్టు న్యాయవాది పొత్తూరి సురేష్ కుమార్ మండిపడ్డారు. 2019 –2024ల్లో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ఎన్నో నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పుడు వారిని నేరస్తులుగా ఎందుకు పరిగణించలేదని ప్రశ్నించారు. అనకాపల్లి రైతు సంఘం జిల్లా కార్యదర్శి అప్పలరాజుపై ప్రభుత్వం విధించిన పీడీ యాక్ట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఎల్బీజీ కార్యాలయంలో రైతు సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జజ్జూరి జయంతి బాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పొత్తూరి సురేష్‌కుమార్ మాట్లాడుతూ వేతనాల పెంపు, కాలుష్య నియంత్రణ, బలవంతపు భూ సేకరణపై ప్రజల తరుపున గొంతు వినిపించే ప్రజాతంత్రవాదులపై ప్రభుత్వాలు అసాధారణ పరిస్థితిలో ఉపయోగించే పీడీ చట్టం, ఉపా చట్టం ప్రయోగించి నిర్బంధించడం నేరపూరిత చర్యగా అభివర్ణించారు. అప్పలరాజు ప్రజల తరుపున ప్రశ్నిస్తే నేరస్తునిగా పరిగణించినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఎందుకు నిర్భంధించలేదని ప్రశ్నించారు. పోలీసులు దేశంలో పీడీ యాక్ట్‌ను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు కూడా పోలీసులపై కేసులు పెట్టొచ్చని తెలిసిన రోజు చట్టాన్ని వెనక్కి తీసుకునే పరిస్థితి వస్తుందన్నారు. బ్రిటీష్ పాలనకు మించిన నిర్బంధం విధిస్తున్న పాలకులకు బ్రిటీష్ పాలకులకు పట్టిన గతే పడుతుందని చెప్పారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ పరిశ్రమల పేరుతో పేదల భూములను పారిశ్రామికవేత్తలకు కట్టబెడుతున్న ప్రభుత్వం తీరును తప్పుపట్టారు. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్‌కే మాబు మాట్లాడుతూ పాలకవర్గం చెప్పుచేతుల్లో నడుస్తున్న పాలకవర్గం ప్రజా ఉద్యమకారులపై తప్పుడు కేసులు బనాయిస్తోందని ఆరోపించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన తొలిరోజుల్లో మీసా చట్టం ప్రయోగించిన ప్రభుత్వాలు కుప్పకూలిన విషయాన్ని గుర్తు చేశారు. పీడీ యాక్ట్ ఉపయోగించి ప్రజా ఉద్యమాలను అణచివేయాలనుకుంటే పొరపాటు పడినట్టేనన్నారు. రౌండ్‌టేబుల్ సమావేశంలో ఎం.అయ్యపురెడ్డి, చుండూరి రంగారావు, పమిడి వెంకటరావు, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, ఏవీ పుల్లారావు, నురుసుల వెంకటేశ్వర్లు, మాదాల వెంకటరావు, బెజవాడ శ్రీనివాసరావు, కనపర్తి సుబ్బారావు, నల్లూరి నరసింహరావు పాల్గొన్నారు.


