శాంతి భద్రతలను పరిరక్షిస్తాం
● మార్కాపురం జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ హర్షవర్ధన్‌రాజు
మార్కాపురం: నూతన మార్కాపురం జిల్లాలో శాంతి భద్రతలను పరిరక్షిస్తామని మార్కాపురం జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ హర్షవర్ధన్‌రాజు తెలిపారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో బుధవారం ఇన్‌చార్జి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని చెప్పారు. మహిళలు, చిన్నారుల భద్రతను మరింత బలోపేతం చేయడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. జిల్లాలో ఎక్కడైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కార చర్యలు తీసుకుంటామన్నారు. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తానని, ప్రతి బాధితునికి తక్షణ న్యాయం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గుట్కా, గంజాయి, నాటుసారా లాంటి అసాంఘిక కార్యకలాపాలను సమూలంగా నిర్మూలించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడతామన్నారు. మెరుగైన సేవలు అందించేందుకు 24 గంటలూ అందుబాటులో ఉంటానని, పోలీసు సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తామని తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయ పరిసర ప్రాంతాలు, పాత బిల్డింగ్, పోలీసు క్వార్టర్స్‌ను పరిశీలించి పోలీసు పరిపాలనా కార్యక్రమాలకు ఉపయోగపడేలా యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని స్థానిక పోలీసు అధికారులను ఆదేశించారు. పట్టణంలోని పట్టుపరిశ్రమ శాఖ, ఎస్‌వీకేపీ కళాశాల పరిసరాలను పరిశీలించారు. మంత్రి స్వామితో పాటు కలెక్టర్ రాజాబాబు, డీఎస్పీ నాగరాజు, ఎస్‌బీ డీఎస్పీ చిరంజీవి, కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర యశ్వంత్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు, డీసీఆర్‌బీ సీఐ దేవ ప్రభాకర్, మార్కాపురం, త్రిపురాంతకం, కనిగిరి, యర్రగొండపాలెం, పామూరు సీఐలు సుబ్బారావు, హసన్, శ్రీనివాసులు, అజయ్‌కుమార్, శ్రీనివాసరావు, ఎస్సైలు పాల్గొన్నారు.


