డివిజన్ స్థాయిలోనూ రెవెన్యూ క్లినిక్‌లు
అద్దంకి: జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న రెవెన్యూ క్లీనిక్‌లను త్వరలో డివిజన్ స్థాయిలోనూ ప్రవేశపెట్టనున్నట్లు కలెక్టర్ పి.రాజాబాబు అన్నారు. పట్టణంలోని ఆర్‌అండ్‌బీ బంగ్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ కార్యాలయాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్త జిల్లాలు, ఐదు కొత్త డివిజన్లు ఏర్పాటు చేశామన్నారు. అందులో భాగంగా బాపట్లలో ఉన్న అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలిపారని చెప్పారు. నూతన రెవెన్యూ డివిజన్లలో భాగంగా అద్దంకి రెవెన్యూ డివిజన్‌గా చేశారన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చ అర్జీల్లో 70 శాతం రెవెన్యూ సమస్యలే వస్తున్నాయని, అంధుకే రెవెన్యూ క్లినిక్‌లను ఏర్పాటు చేశామన్నారు. నెల తరువాత ఆర్డీఓ స్థాయిలో రెవెన్యూ క్లినిక్‌ను ఏర్పాటు చేసి రెవెన్యూ సమస్యలకు సత్వర పరిష్కారం అందించే దిశగా కృషి చేస్తామని తెలిపారు. ఆర్డీఓ లక్ష్మి ప్రసన్న, తహసీల్దార్లు పాల్గొన్నారు.
రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి
రెవెన్యూ సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని నూతన రెవెన్యూ డివిజన్ తొలి అర్డీఓగా (ఇన్‌చార్జి) నియమితులైన లక్ష్మీ ప్రసన్న అన్నారు. పట్టణంలోని అర్‌అండ్‌బీ బంగ్లాలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఆర్డీఓ కార్యాలయాన్ని బుధవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిపాలన వికేంద్రీకరణ లక్ష్యంగా ప్రభుత్వం నూతనంగా అద్దంకిని రెవెన్యూ డివిజన్‌గా చేసిందని చెప్పారు. డివిజన్ పరిధిలో అద్దంకి, దర్శి నియోజకవకవర్గాల్లోని 10 మండలాలుంటాయని చెప్పారు.


