లైంగిక దాడి..ఆపై హత్య..!
ఒంగోలు టౌన్:
కుళ్లిపోయిన స్థితిలో బాలిక మృతదేహం..సంఘటనా స్థలంలో ఒక్క ఆధారమూ లేదు. కానీ జిల్లా పోలీసులు చాకచక్యంగా, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి కేసును ఛేదించారు. వివరాల్లోకి వెళితే..మద్దిపాడు మండలం దొడ్డవరప్పాడు గ్రామ పరిధిలో జూన్ 23న లభించిన బాలిక మృతదేహం లభ్యమైంది. విచారణలో బాలికపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేసినట్లు తేలింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్‌రాజు తెలిపారు. స్థానిక పోలీస్ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. గత ఏడాది జూన్ 23వ తేదిన మద్దిపాడు మండలం దొడ్డవరంపాడు గ్రామ పరిధిలోని కపిల్ లే అవుట్స్ వెనక కుళ్లి పోయిన స్థితిలో గుర్తు తెలియని బాలిక మృతదేహం గ్రామస్తులకు కనిపించింది. గ్రామ వీఆర్వో దండేల మౌనిక ఫిర్యాదు మేరకు మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం వచ్చిన నివేదిక ప్రకారం హత్యగా నిర్ధారించారు. ఎస్పీ ఆదేశాలతో రూరల్ సీఐ శ్రీకాంత్ దర్యాప్తు చేపట్టారు. హత్యకు గురైన బాలికను గుర్తించేందుకు జిల్లాలోని వివిధ పోలీసుస్టేషన్లలో మిస్సింగ్ కేసులను పరిశీలించారు. ఈ క్రమంలో సింగరాయకొండ గ్రామంలోని మూలగుంటపాడు రోడ్డులో సుందర్‌నగర్‌కు చెందిన మోదడుగు తిరుపతమ్మ కూతురు తప్పిపోయినట్లు తెలుసుకున్నారు. వెంటనే ఆమెను సంప్రదించి వివరాలను సేకరించారు. బాలిక ఫొటోలను చూసిన తిరుపతమ్మ చనిపోయిన బాలిక తన కూతురేనని నిర్ధారించింది. దీంతో కేసు కీలక మలుపు తిరిగింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించిన పోలీసులు అన్నీ కోణాల్లో దర్యాప్తు చేశారు. తీగలాగితే డొంక కదిలినట్లు నిందితుల వివరాలను రాబట్టారు. పొన్నలూరు మండలం విప్పుకుంట గ్రామానికి చెందిన దుద్దెల చెన్నకృష్ణ, అదే గ్రామానికి చెందిన దేవరాజు వంశీ, ప్రస్తుతం సింగరాయకొండలో నివసిస్తున్న విప్పకుంట గ్రామానికి చెందిన డబ్బుకొట్టు కోటయ్యలు బాలికనుహత్య చేసినట్లు నిర్ధారించిన పోలీసులు నిందితులను పట్టుకోవడానికి రెండు
రాష్ట్రాల్లో గాలించాల్సి వచ్చింది. నిందితులు తెలంగాణాలోని హైదరాబాద్, నిజామాబాద్, నల్గొండ, రంగారెడ్డి, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, నెల్లూరుల్లో తలదాచుకున్నట్లు తెలిసింది. హత్య చేసినప్పటి నుంచి స్వగ్రామానికి రాకుండా రహస్యంగా ఉన్నట్లు తేలింది. ఈ ముగ్గురు నిందితులను ట్రేస్ చేసిన పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. విచారణలో బాలికను పొలాల్లోకి తీసుకెళ్లి బలవంతంగా మద్యం తాగించి లైంగిక దాడి చేసినట్లు అంగీకరించారు. లైంగిక దాడి విషయం బయట చెబుతుందేమోనన్న భయంతో గొంతునులిమి చంపివేసినట్లు పోలీసు విచారణలో ఒప్పుకున్నారు. బాలిక హత్య కేసును చేదించడంలో రూరల్ సీఐ శ్రీకాంత్‌బాబు, మద్దిపాడు ఎస్సై జి.వెంకట సూర్య, సిబ్బంది షేక్ కరీం, సద్దాం హుసేన్, ఆర్.కృపానందం, వి.హనుమంతరావులను ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
మద్దిపాడు మండలంలో బాలిక హత్య కేసును ఛేదించిన పోలీసులు
ఆరు నెలల క్రితం కుళ్లిన స్థితిలో
బాలిక మృతదేహం లభ్యం
సాంకేతికత సాయంతో నిందితుల అరెస్టు
విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎస్పీ


