మీ అనుభవాలే స్ఫూర్తిగా ముందడుగు
ఒంగోలు టౌన్: పోలీసు శాఖలో వివిధ హోదాల్లో సుదీర్ఘకాలం పనిచేసిన మీ అనుభవాలను స్ఫూర్తిగా తీసుకొని విధి నిర్వహణలో మెరుగ్గా ప్రజలకు సేవ చేసేందుకు కృషి చేస్తామని ఎస్పీ హర్షవర్థన్ రాజు చెప్పారు. జిల్లా విశ్రాంత పోలీసు అధికారుల సంఘం 6వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం పోలీసు కళ్యాణ మండపంలో నిర్వహించిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 75 ఏళ్లు పూర్తి చేసుకున్న 14 మంది విశ్రాంత పోలీసు అధికారులకు, వారి కుటంబసభ్యులను ఎస్పీ సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పూర్వం సాంకేతిక పరిజ్ఞానం లేకపోయినా సంచలనం సృష్టించిన అనేక దొంగతనం కేసులను చేధించారని గుర్తు చేశారు. అత్యద్భుతమైన ప్రతిభను కనబరిచారని కొనియాడారు. పోలీసు శాఖలో ఎంతో ఒత్తిడితో కూడుకున్న విధులను నిబద్ధతతో నిర్వర్తించారని ప్రశంసించారు. కుటుంబ జీవితాన్ని త్యాగం చేసి నిజాయితీగా విధులు నిర్వహించిన పోలీసు అధికారులుగా ఎంతో మంది అభిమానాన్ని పొందారని చెప్పారు. మీ సేవలను, అనుభవాలను పాఠాలుగా స్వీకరిస్తామన్నారు. రిటైర్డ్ ఉద్యోగులను సన్మానించడం అనేది గొప్ప సంప్రదాయంగా, ఇలాంటి కార్యక్రమాలు ఏటా నిర్వహించడం ద్వారా ఆత్మ సంతృప్తి లభిస్తుందన్నారు. ఎస్పీ హర్షవర్థన్ రాజును విశ్రాంత పోలీసు అధికారులు ఘనంగా సన్మానించారు. ఆర్‌ఐ సీతారామిరెడ్డి, సంఘ నాయకులు జె.రామమూర్తి, కేవీ సుబ్బారావు, షేక్ ఖాశీం, షేక్ అల్లాబక్షు, ఎం.ప్రసాదరావు, రాజయ్య, షేక్ షుకూర్, వీవీ నారాయణ, కె.వెంకటేశ్వరరెడ్డి, తిమోతి, పి.సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
విశ్రాంత పోలీసు అధికారుల సన్మాన సభలో ఎస్పీ హర్షవర్థన్ రాజు


