కీచక ఉపాధ్యాయుడు
దర్శి: విద్యార్థులకు విద్యా బుద్ధలు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు దారి తప్పాడు. తాను గురువునన్న సంస్కారాన్ని మరిచి పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న ఇద్దరు చిన్నారులతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన జిల్లా దర్శి పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. దర్శి పట్టణం కురిచేడు రోడ్డులో నివాసముండే ఇద్దరు చిన్నారులు ఓ ప్రభుత్వ స్కూలులో ఐదో తరగతి చదువుతున్నారు. అదే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు వీరితో చనువుగా ఉంటూ వస్తున్నాడు. ఎప్పటిలాగే సోమవారం చిన్నారులు ఇద్దరూ స్కూలుకు వెళ్లారు. సాయంత్రం వారి ఇద్దర్ని స్కూలులోనే ఉండమని చెప్పాడు. అందరూ వెళ్లిపోయిన తర్వాత మీకు డబ్బులు ఇస్తానని చెప్పి ఆశ పెట్టాడు. వారితో అసభ్యంగా ప్రవర్తించాడు. భయాందోళన చెందిన సదరు విద్యార్థినులు ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. మంగళవారం ఉదయం చిన్నారుల తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయుడిని చితకబాదారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే ఎంఈఓ రమాదేవి స్కూలులో చోటుచేసుకున్న పరిణామాలపై చిన్నారులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. అనంతరం ఆమె ఈ విషయాన్ని డీఈఓ దృష్టికి తీసుకెళ్లారు. సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇదిలా ఉండగా సదరు ఉపాధ్యాయుడు అధికార పార్టీకి సామాజిక వర్గానికి చెందిన వాడు కావడంతో అతనిని కేసు నుంచి తప్పించేందుకు కొంత మంది టీడీపీ నాయకులు రాజీ ప్రయత్నాలు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయం ఎస్‌ఐ మురళీని వివరణ కోరగా విద్యార్థినుల తల్లిదండ్రులు కేసు పెట్టలేదని చెప్పారు.
ఐదో తరగతి చదువుతున్న ఇద్దరు చిన్నారులపై అసభ్య ప్రవర్తన
ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లుకు చిన్నారుల తల్లిదండ్రులు, గ్రామస్తుల దేహశుద్ధి
ఉపాధ్యాయున్ని సస్పెండ్ చేసిన డీఈఓ


