సూపర్ సిక్స్‌పై చేతులెత్తేసిన బాబు
తాళ్లూరు: సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడంలో విఫలమైన చంద్రబాబు చేతులెత్తేశాడని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. గుంటి గంగమ్మ జాతర సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన రెండు విద్యుత్ ప్రభలపై ఎమ్మెల్యేతో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ హాజరయ్యారు. ముందుగా గంగమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ వారిని శాలువాలు, పూలమాలతో ఘనంగా సత్కరించారు. విద్యుత్ ప్రభపై గుంటి గంగమ్మ తల్లి జాతర సందర్భంగా వారు నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకుండా, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తానని చెప్పి రూ.10 వేల జీతం అందిస్తానని చంద్రబాబు మోసగించారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని సీఎంగా గెలిపించుకోవాలని, ఇది ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుల బాధ్యత అన్నారు.
బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ దర్శి ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రతి ఒక్క కార్యకర్తకు, పార్టీ నాయకులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. చంద్రబాబు ఓడిపోతాడన్న భయంతోనే ఉమ్మడిగా వచ్చి మోసపూరితమైన మాటలు ప్రజలకు చెప్పి గెలిచారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వంద శాతం అమలు చేయడం వైఎస్ కుటుంబానికే సాధ్యమని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్‌మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చారన్నారు. 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విజయం సాధిస్తారని చెప్పారు.
జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ నాడు–నేడు పథకం అమలు చేసి పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దిన ఘనత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదేనని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలు అమలు చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
సుపరిపాలన వైఎస్ కుటుంబానికే సాధ్యం 2029లో అధికారంలోకి వచ్చేది వైఎస్సార్ సీపీనే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, బూచేపల్లి వెంకాయమ్మ
సూపర్ సిక్స్‌పై చేతులెత్తేసిన బాబు


