హామీల్లో సిక్సర్‌లు.. అమలులో జీరోలు
దర్శి: చంద్రబాబు ఎన్నికల ముందు ఓట్ల కోసం హామీలు ఇవ్వటంలో సిక్సర్‌లు కొట్టి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారని.. తీరా హామీలు అమలు చేయడంలో జీరోలు అయ్యారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఎద్దేవా చేశారు. మండలంలోని రాజంపల్లి ముసీ నది ఒడ్డున ఉన్న సువర్చలా సమేత ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ల సందర్భంగా పొదిలి మండలం కుంచేపల్లి గ్రామస్తులు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్ అన్నా రాంబాబు తో పాటు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారిని ప్రభ నిర్వాహకులు సన్మానించారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు అలవి కాని హామీలు ఇచ్చి ఆ తరువాత ఒక్కటీ అమలు చేయకుండా నాలుక మడతేయడంలో చంద్రబాబు ఆరి తేరారన్నారు. సూపర్ సిక్స్ పథకాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ‘‘ఇప్పుడు పథకాలు చూస్తే భయమేస్తుంది.. నేను అమలు చేయలేనని’’ చేతులెత్తి తూర్పు తిరిగి దణ్ణం పెడుతున్నారన్నారు. ఇటీవల ప్రకృతి వైపరీత్యాలకు రైతులు తీవ్రంగా నష్టపోతే వారికి రూపాయి కూడా విదల్చలేదన్నారు.
ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే నాయకుడు రాష్ట్రానికి అవసరం
ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే నాయకుడు రాష్ట్రానికి ఎంతో అవసరం ఉందని బూచేపల్లి అన్నారు. అప్పుడే రాష్ట్రంలో పేదలకు సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. పాలన అంటే జగనన్నను చూసి నేర్చుకోవాలని సూచించారు. వైఎస్సార్ సీపీ మార్కాపురం ఇన్‌చార్జ్ అన్నా రాంబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి పరుగులు పెట్టించామన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సంక్షేమం అటకెక్కించారని, అభివృద్ధి పూర్తి గా కుంటుపడిందని చెప్పారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి, సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకులు కేవీ రమణారెడ్డి, పేరం సుభాష్ చంద్రబోస్ రెడ్డి, నాగిరెడ్డి, నారాయణరెడ్డి, నాయకులు, కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
చంద్రబాబు సూపర్ సిక్స్ అమలు చేయలేనని చేతులెత్తి డకౌట్ అయ్యాడు ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి


