పోలీస్ విచారణకు హాజరైన డాక్టర్ ప్రభావతి
ఒంగోలు టౌన్: మాజీ ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టడీ కేసు విచారణాధికారి, ఎస్పీ ఏఆర్ దామోదర్ ఎదుట గుంటూరు జీజీహెచ్ రిటైర్డ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఆమెను 5వ నిందితురాలిగా చేర్చి విచారణ చేస్తున్నారు. సోమవారం ఉదయం విచారణకు వచ్చిన ఆమెను మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత హాజరుకావాలని చెప్పారు. తొలిరోజు సుమారు నాలుగున్నర గంటల పాటు విచారించారు. విచారణలో ఆమె సంతృప్తికరంగా సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. మంగళవారం కూడా ఆమె విచారణకు హాజరుకానున్నారు.
అట్రాసిటీ కేసు విచారించిన డీఎస్పీ
యర్రగొండపాలెం: స్థానిక పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును మార్కాపురం డీఎస్పీ యు.నాగరాజు సోమవారం విచారించారు. మండలంలోని మొగుళ్లపల్లెకు చెందిన బి.రాజేష్ యర్రగొండపాలెంలోని మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట సెల్ పాయింట్ నిర్వహిస్తున్నాడు. ఆ గ్రామానికి చెందిన ఆరుగురు ఆ సెల్ పాయింట్ వద్దకు వచ్చి రాజేష్‌ను కులం పేరుతో దూషిస్తూ దాడి చేశారు. ఈ సంఘటనపై బాధితుడు ఈ నెల 5వ తేదీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు డీఎస్పీ మొగుళ్లపల్లి వెళ్లి దాడికి కారణాలపై విచారణ చేశారు. ఆయన వెంట సీఐ సీహెచ్ ప్రభాకరరావు, ఎస్సై పి.చౌడయ్య ఉన్నారు.
హైవేపై డీజిల్ దొంగల హల్‌చల్!
● పోలీసుల అదుపులో డీజిల్ దొంగలు
● విచారిస్తున్నట్లు సమాచారం
టంగుటూరు: జాతీయ రహదారిపై డీజిల్ దొంగలను పోలీసులు ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. అందిన సమాచారం మేరకు.. జాతీయ రహదారిపై రాత్రి సమయంలో లారీలను నిలిపి డ్రైవర్లు నిద్రిస్తున్న సమయంలో పల్నాడు జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులు డీజిల్ దొంగిలించి టంగుటూరు మండలంలోని వల్లూరులో విక్రయిస్తున్నారు. ఈ విషయంపై ఉప్పందడంతో టంగుటూరు పోలీసులు దాడి చేసి దొంగలను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి సుమారు 300 లీటర్ల డీజిల్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. డీజిల్ దొంగలను టంగుటూరు పోలీసు స్టేషనుకు తరలించి తమదైన శైలిలో విచారిస్తున్నట్లు తెలిసింది. కాగా దీనిపై పోలీసులు ఎటువంటి విషయాలు బయటకు వెల్లడించలేదు. జాతీయ రహదారిపై డీజిల్ దొంగలు హల్‌చల్ చేస్తున్నా టోల్ ప్లాజా యాజమాన్యం, టోల్ ప్లాజా భద్రతా సిబ్బంది పట్టించుకోవడం లేదని పలువురు లారీ డ్రైవర్లు ఆరోపిస్తున్నారు.
వాహనదారులపై
కేసులు నమోదు
● 44 మందికి రూ.1.36 లక్షల జరిమానా
ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగరంలో వాహనాలు తనిఖీ చేసి నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఉప రవాణా కమిషనర్(డీటీసీ) ఆర్.సుశీల పేర్కొన్నారు. సోమవారం ఆర్‌టీసీ బస్టాండ్ సెంటర్‌తోపాటు నగరంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించామని తెలిపారు. మొత్తం 263 వాహనాలను తనిఖీ చేసి, నిబంధనలు పాటించని 44 మందిపై నమోదు చేశామని చెప్పారు. హెల్మెట్, సరైన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ లేనివారు, ఓవర్ స్పీడ్‌తో వెళ్తున్న వారిని గుర్తించి రూ.1.36 లక్షల జరిమానా విధించామని తెలిపారు. తనిఖీల్లో ఎంవీఐలు ఎ.కిరణ్ ప్రభాకర్, కె.రామచంద్ర రావు, ఎల్.సురేంద్ర ప్రసాద్, ఏఎంవీఐలు యు.ధర్మేంద్ర, బి.భానుప్రకాష్ పాల్గొన్నారు.
జొన్నచొప్ప దగ్ధం
అర్థవీడు(కంభం): ప్రమాదవశాత్తు నిప్పంటుకొని జొన్నచొప్ప దగ్ధమైన సంఘటన అర్థవీడు మండలంలోని అంకభూపాలెంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన మెట్ల పోలురాజు, మెట్ల శేఖర్ 5 ట్రాక్టర్ల చొప్పను వామిగా వేసుకొని పశువులకు మేతగా వినియోగించుకుంటున్నారు. సోమవారం చొప్పకు నిప్పంటుకొని మంటలు చెలరేగగా కంభం అగ్నిమాపక సిబ్బందికి సమచారం అందించారు. మంటలు ఆర్పేలోగా చొప్ప మొత్తం దద్ధమై రూ.50 వేలు నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు.
పోలీస్ విచారణకు హాజరైన డాక్టర్ ప్రభావతి
పోలీస్ విచారణకు హాజరైన డాక్టర్ ప్రభావతి


