మాటమీద నిలబడే వ్యక్తి.. వైఎస్‌ జగన్‌ | - | Sakshi
Sakshi News home page

మాటమీద నిలబడే వ్యక్తి.. వైఎస్‌ జగన్‌

Apr 4 2025 1:03 AM | Updated on Apr 4 2025 1:05 AM

మాటమీ

మాటమీద నిలబడే వ్యక్తి.. వైఎస్‌ జగన్‌

దర్శి: దేశంలో మాట మీద నిలబడిన ఒకే ఒక్క సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అన్నారు. దర్శి మండలంలోని శామంతపూడి గ్రామంలో ఆంజనేయస్వామి తిరునాళ్లు మహోత్సవాన్ని బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. తిరునాళ్లలో వైఎస్సార్‌ సీపీ నాయకుడు అమరా మురళి ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ సీపీ ప్రభపై ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డితో పాటు జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ పాల్గొన్నారు. వారిని దుశ్శాలువాలు, పూలమాలలతో నాయకులు ఘనంగా సత్కరించారు. ప్రభ ఏర్పాటు చేసిన మురళిని బూచేపల్లి అభినందించారు. ఈ సందర్భంగా శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన మాట మీద నిలబడిన వ్యక్తులు ఇద్దరే ఇద్దరున్నారన్నారు. వారిలో ఒకరు దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి కాగా, రెండో వ్యక్తి ఆయన కుమారుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని తెలిపారు. తన తండ్రి ఆశయ సాధనలో భాగంగా పేదలందరికీ న్యాయం చేయడం జగనన్నతోనే సాధ్యమని అన్నారు. జగనన్న పాలనలో పార్టీలు, కులాలు, మతాలు చూడలేదని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలన్నీ అందించిన గొప్ప నాయకుడని కొనియాడారు. పనులు చేసుకునే ప్రజలు తమ పనులు మానుకుని పథకాల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగాల్సిన అవసరం లేకుండా ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీర్‌, 2000 మందికి ఒక సచివాలయం, సచివాలయంలో సేవలందించేందుకు 11 మంది ఉద్యోగులను నియమించిన గొప్ప సీఎం అని గుర్తుచేశారు. నేరుగా గడపగడపకు పథకాలు, ప్రభుత్వ సేవలు అందించడం వైఎస్‌ జగన్‌కే సాధ్యమైందన్నారు.

కూటమి పాలన చూసి బాధపడుతున్న ప్రజలు...

ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వ పాలన చూస్తూ జగనన్న లాంటి గొప్ప సీఎంని పోగొట్టుకుని తప్పు చేశామని ప్రజలు బాధపడుతున్నారని బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో జగనన్నను మళ్లీ సీఎం చేసుకోవాలని ప్రతి పేదవాడు పరితపిస్తున్నాడన్నారు. జగనన్నకు వృద్ధాప్యం అప్పుడే రాదని, ఆయనకు ఇంకా ఎంతో వయసుందని, మళ్లీ మీ అందరి మద్దతుతో సీఎంగా పేదలందరికీ జగనన్న న్యాయం చేస్తారని భరోసా ఇచ్చారు. గత ఎన్నికల్లో తన గెలుపునకు కృషి చేసిన అందరికీ బూచేపల్లి ధన్యవాదాలు తెలిపారు. తమ కుటుంబంపై ప్రేమ, నమ్మకంతో తన తల్లికి జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా, తనకు వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షునిగా జగనన్న అవకాశం కల్పించారన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేసి మళ్లీ వైఎస్సార్‌ సీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని, జగనన్నను సీఎంని చేసుకునేందుకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ దర్శి మండల కన్వీనర్‌ వెన్నపూస వెంకటరెడ్డి, సాగర్‌ ప్రాజెక్ట్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ సద్ది పుల్లారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కేవీ రెడ్డి, వైస్‌ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు కొల్లా ఉదయభాస్కర్‌, నాయకులు పమిడి కొండయ్య, అమరా వెంకటేశ్వర్లు, దుగ్గిరాల రామస్వామి, అమరా పద్దయ్య, అమరా నారాయణ, తదితరులు పాల్గొన్నారు.

పేదలందరికీ న్యాయం జగనన్నతోనే సాధ్యం వచ్చే ఎన్నికల్లో జగనన్నను మళ్లీ సీఎంను చేసుకుందాం వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి

మాటమీద నిలబడే వ్యక్తి.. వైఎస్‌ జగన్‌1
1/1

మాటమీద నిలబడే వ్యక్తి.. వైఎస్‌ జగన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement