
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగంతో భయాందోళన సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. లక్ష్మీనారాయణపై అక్రమ కేసులు పెట్టడంతో తీవ్ర మనస్థాపం చెందారని తెలిపారు. పొలిటికల్ బాసులు చెప్పినట్టు పోలీసులు నడుచుకుంటున్నారని ఆరోపించారు.
రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్త లక్ష్మీనారాయణను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ నేతలు పరామర్శించారు. అనంతరం, సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు నాయకత్వంలో కూటమి ఏర్పాటై ఏడాది అయ్యింది. ఎన్నికలకు ముందు వారి పాలన డిఫరెంట్‌గా ఉంటుందన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. పోలీసు వ్యవస్థను ప్రైవేటు ఆర్మీలా తయారు చేసి ప్రత్యర్దులపై దాడులు, తప్పుడు కేసులు పెడుతున్నారు. రోజుకు కనీసం పది తప్పుడు కేసులు పెడుతున్నారు. అరాచక శక్తులు, గూండాలు చేసే పనులు పోలీసులు చేస్తున్నారు. ఆర్గనైజ్డ్ క్రైం చేస్తున్నారు. క్రిమినల్ గ్యాంగ్‌కు యూనిఫారం వేసినట్లుంది.
లక్ష్మీనారాయణ ఏ పార్టీ అన్నది కాదు.. కులాన్ని తీసుకొచ్చారు. డీఎస్పీకి సివిల్ మ్యాటర్‌లో ఏం పని. ఫ్రెండ్లీ పోలీస్ మరిచి యాభై ఏళ్ల క్రితం ఎమర్జెన్సీకి తీసుకెళ్తున్నారు. రక్షించాల్సిన వారే అరాచక శక్తి అయితే ఎవరు ఏం చేయగలరు. శాతవాహన కాలేజీని అర్ధరాత్రి కూలగొట్టాల్సిన అవసరం ఏంటి. దీని వెనుక టీడీపీ నేత ఉన్నారు. సంఘ విద్రోహక శక్తుల మాదిరిగా ప్రవర్తిస్తున్నారు. నిజాయితీ ఉన్న పోలీసులు లూప్ లైన్‌లో ఉన్నారు. వ్యవస్థ గాడి తప్పింది. ఒక్కరిపై చర్యలు లేవు. మరణవాంగ్మూలం కంటే ఏది ఎక్కువ కాదు.

లక్ష్మీనారాయణ స్వయంగా పోలీసుల వేధింపుల గురించి చెప్పారు. కృష్ణవేణి, సుధారాణిలను వేధించారు. ఆర్గనైజ్డ్ అరాచకానికి చట్టాన్ని కాపాడే పోలీసులను అడ్డం పెట్టుకున్నారు. ఇంత కన్నా దిగజారడం ఉంటుందా?. చంద్రబాబు, లోకేష్‌లు పరిస్థితి గమనించాలి. అదుపు తప్పుతున్న వ్యవస్థలు రేపు మరింత డేంజర్ అవుతాయి. లక్ష్మీనారాయణ ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలి. వేధింపులకు పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. తప్పుడు కేసులు, వేధింపులపై కోర్టులు, మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకెళ్తాం. దాడులను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉపేక్షించలేదు’ అని వ్యాఖ్యలు చేశారు.