
బాధితురాలి తల్లిదండ్రులను ఓదారుస్తున్న ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి
మంత్రి కొల్లు రవీంద్రపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆగ్రహం
చిలకలపూడి(మచిలీపట్నం): టీడీపీ నాయకుడి కుమారుడు ప్రేమ పేరుతో ఓ యువతిని మోసం చేస్తే మంత్రి కొల్లు రవీంద్ర రాజీకి ప్రయత్నించడం సిగ్గుచేటని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘మీ ఇంటి ఆడపిల్లకు కూడా ఇలాగే న్యాయం చేస్తారా?’ అని మంత్రిని ఆమె ప్రశ్నించారు. మచిలీపటా్ననికి చెందిన ఓ యువతిని టీడీపీ నాయకుడి కుమారుడు ప్రేమ పేరుతో గోవా తీసుకువెళ్లి మోసం చేసిన విషయం తెలిసిందే.
తమ బిడ్డకు న్యాయం జరగదనే వేదనతో ఆ యువతి తల్లి పోలీస్‌స్టేషన్ వద్ద ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను గురువారం వరుదు కల్యాణి పరామర్శించారు. అనంతరం వరుదు కల్యాణి మీడియాతో మాట్లాడుతూ బాధితులను హైదరాబాద్‌కు మంత్రి పిలిపించుకుని రాజీకి ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. బాధిత యువతిని ఆమె తల్లిదండ్రులతో కూడా మాట్లాడనీయకుండా హోమ్‌లో నిర్బంధించడం దుర్మార్గమన్నారు.
తాము ఏం చేసినా మంత్రులు, ఎమ్మెల్యేలు చూసుకుంటారనే ధైర్యంతో టీడీపీ మూకలు చెలరేగిపోతున్నాయని, ఇందుకు రాప్తాడు, రాజమండ్రి, తిరుపతి ఘటనలతోపాటు తాజాగా మచిలీపట్నం ఉదంతమే నిదర్శనమని మండిపడ్డారు. జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక, విజయవాడ, మచిలీపట్నం మేయర్లు రాయన భాగ్యలక్ష్మి, చిటికిన వెంకటేశ్వరమ్మ, పేర్ని కిట్టు పాల్గొన్నారు.
మచిలీపట్నం టీడీపీ నేత కుమారుడిపై కేసు
కోనేరు సెంటర్ (మచిలీపట్నం): ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి యువతిని బలవంతంగా తీసుకువెళ్లిన టీడీపీ సీనియర్ నాయకుడు, మచిలీపట్నం మునిసిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం కుమారుడు అభినవ్‌పై పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. స్థానిక పీకేఎం కాలనీకి చెందిన యువతిని అభినవ్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి గోవా తీసుకెళ్లి నాలుగు రోజులు గడిపాడు.
యువతి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో కుమారుడిని కాపాడేందుకు సుబ్రహ్మణ్యం విశ్వప్రయత్నాలు చేశారు. యువతిని బెదిరించి వెనక్కితగ్గేలా చేసేందుకు ప్రయత్నించారు. అది ఫలించకపోవటంతో రెండేళ్ల తరువాత ఇద్దరికి పెళ్లి జరిపిస్తానంటూ మాట మార్చారు. దీనికి యువతి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఆమె సామాజిక వర్గానికి చెందిన టీడీపీ, జనసేన నేతలను స్టేషన్‌కు పంపి పంచాయితీ పెట్టించి బెదిరించాలని చూశారు.
పోలీసులనూ పావుగా వాడుకునే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. చేసేది లేక ఏకంగా స్టేషన్ బయటనే యువతి కుటుంబసభ్యులను మరింత బెదిరించేందుకు ప్రయత్నించారు. బిడ్డ జీవితం నాశనం అవుతుందని ఆందోళన చెందిన యువతి తల్లి స్టేషన్ ఎదుట పురుగుమందు తాగింది. వైఎస్సార్‌సీపీ, ప్రజాసంఘాలు, యువతి పక్షాన నిలబడ్డాయి.
ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ గంగాధరరావు జోక్యం చేసుకున్నారు. ఆయన ఆదేశాలు, యువతి స్టేట్‌మెంట్ మేరకు అభినవ్‌పై సెక్షన్లు మారుస్తూ చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేశారు. యువతిపై అభినవ్ గోవాలో లైంగికదాడికి పాల్పడినట్లు విచారణలో తేలింది. అతడిని అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అభినవ్‌పై పోలీసులు కేసు నమోదు చేయటం పట్ల మచిలీపట్నం కాపు సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు.