
ఎన్టీఆర్ జిల్లా: ప్రశాంతమైన తిరువూరులో టీడీపీ గూండాలు విధ్వంసం సృష్టించారని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ విమర్శించారు. ‘టీడీపీ గూండాలు మాపై దాడి చేశారు కేశినేని చిన్నియే టీడీపీ గూండాలను మాపైకి పంపారు. మా కారును ధ్వంసం చేశారు.. మమ్మల్ని హతమార్చాలని చూశారు, టీడీపీ గూండాల దాడికి పోలీసులు సహకరించారు. మాపై దాడి చేసిన వారిని ఎవరినీ వదిలి పెట్టం. పోలీసులే రాజకీయం చేస్తున్నారు.
కౌన్సిలర్లకు వారి ఇంటి నుంచి భద్రత ఇస్తామని వితండవాదం చేశారు. మా కౌన్సిలర్లకు మేమే రక్షణగా నిలిచాం. టిడిపి ఎంపీ కేశినేని చిన్ని మందు పోయించి టిడిపి గూండాలను మా పైకి రెచ్చగొట్టారు. మా కారును పైకి లేపి పల్టీలు కొట్టించి...ధ్వంసం చేయాలని చూశారు. మా కారు ధ్వంసం చేసే వరకూ పోలీసులు చూస్తూ ఊరుకున్నారు’ అని ధ్వజమెత్తారు.
కోర్టు చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు
నేను 35 ఏళ్లుగా తిరువూరు రాజకీయాలు చూస్తున్నా. తిరువూరు టిడిపి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఒక గూండా మాదిరి వ్యవహరించారు. ఇలాంటి ఎమ్మెల్యేని తిరువూరు ప్రజలు ఎన్నడూ చూడలేదు. కూటమి నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. టిడిపి నేతలను చట్టపరంగా శిక్షిస్తాం. మాకు రక్షణ కల్పించమని కోర్టు చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు. వైఎస్సార్‌సీపీ మహిళా కౌన్సిలర్లను బలవంతంగా లాక్కెళ్లిపోయారు. అసలు ఈ రాష్ట్రం ఎటుపోతుంది. రాజ్యాంగబద్ధంగా కూటమి ప్రభుత్వం నడుచుకోవడం లేదు. రాబోయేది జగన్ మోహన్ రెడ్డి 2.0 పాలనే. తప్పుచేసిన ప్రతి ఒక్కరినీ గుర్తుంచుకుంటాం. మాపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన వారి పై కేసు పెట్టి చట్టం ముందు నిలబెడతాం’ అని తిరువూరు వైఎస్సార్‌సీపీ ఇంఛార్జి,నల్లగట్ల స్వామిదాస్ హెచ్చరించారు.
టీడీపీ గూండాలు భయోత్పాతం స్పష్టించారు
రెండు గంటల పాటు టిడిపి గూండాలు భయోత్పాతం సృష్టించారు. తిరువూరు వెళ్లడానికి మాకు ఎవరి పర్మిషన్ అవసరం లేదు. పోలీసులే దగ్గరుండి టిడిపి గూండాలతో మాపై దాడి చేయించారు, మేం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపాం. నా కారును ధ్వంసం చేస్తున్నా.. పోలీసులు చోద్యం చూశారు. కౌన్సిలర్లకు భద్రత కల్పించమని ఎన్నికల కమిషనర్ , హైకోర్టు ఆదేశాలున్నా పోలీసులు పెడచెవిన పెట్టారు. ఒక్కో కౌన్సిలర్ కు ఒక్కొక్క గన్ మెన్ ఇవ్వాలని ఆదేశాలున్నాయ్. పోలీసులు రక్షణ ఇవ్వకపోతే మేమే రక్షణ కవచంలా నిలిచాం. మా కారును ధ్వంసం చేసి మా పై హత్యాయత్నం చేశారు
తిరువూరు టిడిపి ఎమ్మెల్యే వీధి రౌడీలా ప్రవర్తించాడు. మా కారును అడ్డగించి మా పై దాడి చేసారు. నన్ను , స్వామిదాస్ ను కులం పేరుతో దూషించి చంపేస్తామని బెదిరించారు’ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ స్పష్టం చేశారు.