విజయవాడ, సాక్షి: తప్పు చేసి ఏసీబీ కేసు ఎదుర్కొన్న రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు.. కుల అహంకారంతో ప్రవర్తిస్తే గనుక మిగతా కులాలు తిరగబడతాయని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం హితవు పలికారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి, వైఎస్ జగన్‌ను ఉద్దేశించి ఏబీ వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు కుల జాఢ్యానికి నిదర్శనమని అన్నారాయన.
ఏబీవీ ‘కమ్మ’ వ్యాఖ్యలపై తాజాగా తలశిల రఘురాం మీడియాతో మాట్లాడారు. ఆయన అహంకారం తో తలతిక్కగా ప్రవర్తిస్తున్నారు. కానీ, కుల అహంకారం తో ప్రవర్తిస్తే మిగతా కులాలు తిరగబడతాయి అని తెలుసుకోవాలి. ఏబీ వెంకటేశ్వరరావు తప్పు చేసి ఏసీబీ కేసు ఎదుర్కొన్నాడు. దానికి కమ్మ కులం మొత్తానికి అపాదించడం ఏంటి..?
ఏబీ వెంకటేశ్వరరావు భాష అభ్యంతకరంగా ఉంది. కమ్మ అధికారులు అందరూ వైఎస్ జగన్ ప్రభుత్వంలో కీలక పోస్టింగులు చేపట్టారు. వైఎస్సార్, వైఎస్ జగన్‌లు ఏనాడూ కులం కోసం పని చెయ్యలేదు. ఇద్దరూ కులాలకు అతీతంగా పాలన చేశారు.
చంద్రబాబు, లోకేష్ లు ఎందుకు ఏబీ వెంకటేశ్వరరావు పై చర్యలు తీసుకోలేదు. కమ్మ కులం ఓట్లేస్తేనే టీడీపీ గెలిచిందా?. ఏబీవీ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ స్పందించరేం?. లేకుంటే.. పవన్ కూడా కమ్మ కులానికి మద్దతిస్తున్నట్టుగా ప్రజలు భావిస్తారు అని తలశిల అన్నారు.

సంబంధిత వార్త: జగన్‌ను కమ్మవాళ్లు అడ్డుకోవాలి


