ఏం సక్సెస్ సాధించారని సూపర్ సిక్స్ బహిరంగ సభ: తలారి రంగయ్య | Ysrcp Leader Talari Rangaiah Fires On Chandrababu And Pawan Kalyan | Sakshi
Sakshi News home page

ఏం సక్సెస్ సాధించారని సూపర్ సిక్స్ బహిరంగ సభ: తలారి రంగయ్య

Sep 4 2025 7:20 PM | Updated on Sep 4 2025 8:25 PM

Ysrcp Leader Talari Rangaiah Fires On Chandrababu And Pawan Kalyan

సాక్షి, తాడేపల్లి: సూపర్‌ సిక్స్ సక్సెస్ పేరుతో అనంతపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించే అర్హత కూటమి ప్రభుత్వానికి లేదని మాజీ ఎంపీ తలారి రంగయ్య మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అనంతపురం జిల్లాకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు సరికదా.. కూటమి ప్రభుత్వం ఆర్డీడీ రెన్యువల్, నీటి సరఫరా, పెనుగొండ వైద్య కళాశాల ప్రైవేటీకరణ వంటి అంశాల్లో జిల్లాకు తీరని అన్యాయం చేసిందని ఆక్షేపించారు. జిల్లాకు జరిగిన అన్యాయానికి ఏ రకంగా న్యాయం చేస్తారో.. ప్రభుత్వం నిర్వహిస్తున్న సభ సాక్షిగా సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

అనంతపురం జిల్లాకేం చేశారు..?
సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ పేరుతో కూటమి ప్రభుత్వం అనంతపురంలో 3 లక్షల మందితో సభ నిర్వహించబోతుంది. అయితే అనంతపురం జిల్లాకు ఏం చేశారని... ఏం తెచ్చారని ఈ సభ పెడుతున్నారు. ఈ సభలో ట్రిపుల్ ఇంజిన్ సర్కారు ద్వారా మీరు ఈ ప్రాంత ప్రజల సమస్యలపై మాట్లాడాలి. మీ సభా ప్రాంగణానికి సమీపంలో ఆర్డీటీ ఉంది. అది క్షీణదశకు చేరి, మూత దశలోకి వచ్చింది. దానిపైన ఏమైనా మాట్లాడతారా?

ఎన్నికల్లో టిక్కెట్లు పంచుకోవడానికి, మంత్రి పదవులు తీసుకోవడానికి మీకు చర్చించే సమయం ఉంది కానీ.. ఆర్టీడీకి రెన్యువల్ తీసుకురావడానికి ఎందుకు సమయం లేదు ? మీకు ఎందుకు అది ముఖ్యమైన అంశం కాకుండా పోతుంది? ఇవాళ మీరు చెబుతున్న పీ4 లాంటి కాన్సెప్ట్ ను స్పెయిన్ నుంచి  1969లో వచ్చిన ఆర్టీడీ సాధిస్తూ వచ్చింది.  అలాంటి ఆర్టీటీ రెన్యువల్  చేసే ప్రయత్నం చేయకుండా మీరు పీ 4 గురించి మాట్లాడ్డం.. సక్రమంగా నడుస్తున్న వాళ్ల కాళ్లు నరికి, వారికి జైపూర్ పుట్ అమర్చుతామన్నట్లుంది.

మాకెందుకు నీళ్లివ్వరు?
మీ మీటింగ్‌ నుంచి నడిచి వెళ్లేంత దూరంలోనే కుప్పానికి నీళ్లు తీసుకుపోయే కాలువ లైనింగ్ వేసి ఉంది. మాది అత్యంత తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతం అయినా.. కుప్పానికి నీళ్లు తీసుకుపోతూ.. పక్కనే జీడిపల్లి నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలోఉన్న కళ్యాణదుర్గం, రాయదుర్గానికి మాత్రం నీళ్లివ్వలేదు. కాలువలు తవ్వలేదు. చంద్రబాబు నాయకత్వం వహిస్తున్న కుప్పానికి నీళ్లు పోతున్నాయే తప్ప మాకు నీళ్లు లేవు. మాకెప్పుడు నీళ్లిస్తారు? దాని గురించి ఈ సభలో ఏమైనా మాట్లాడబోతున్నారా?

..మరో వైపు అనంతపురం జిల్లాకు వచ్చిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆలిండియా మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)ను చంద్రబాబు తనయుడు లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గానికి తీసుకుని పోయి, అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. కనీసం మీరు దానికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయలేదు సరికదా మా నాయకుడు వైఎస్‌ జగన్‌ హయాంలో పెనుగొండలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తే మీరు దాన్ని కూడా బ్రతకనివ్వకుండా పీపీపీ మోడ్‌లో మార్చి ప్రజలకు నష్టం చేస్తున్నారు.

మద్యం అక్రమ సంపాదనలో కూటమి నేతలు దేశంలో నెంబర్ వన్:
మీ సమావేశానికి వచ్చే ప్రజా ప్రతినిధులను సూటిగా అడుగుతున్నాను. హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు టీడీపీ సమావేశానికి వచ్చే ఏ ప్రజాప్రతినిధి అయినా మీ నియోజకవర్గంలో మద్యం బెల్టుషాపులు నడవడం లేదు అని చెప్పగలరా? ఓపెన్‌గా ఛాలెంజ్ చేస్తున్నాను మీ గెజిట్ పత్రికల్లోనే అక్రమ మద్యం వరద అని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అలా ఎవరైనా చెప్పే ధైర్యం చేయగలిగితే.. నేను కేవలం నాలుగు రోజుల వ్యవధిలో ఆ నియోజకవర్గంలో ఏ మండలంలో, ఏ గ్రామంలో బెల్టు షాపులు నిర్వహిస్తున్నారో చెప్పగలను.

అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ఒక్కో బాటిల్ పైన అక్రమంగా రూ.10 నుంచి రూ.40 వరకు దోచుకుంటున్నారు. మద్యం అక్రమ అమ్మకాల ద్వారా ఈ ప్రభుత్వంలో అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల అక్రమ సంపాదన మరే కాలంలోనూ లేదు. ఒక్క కళ్యాణ దుర్గం నియోజకవర్గం లోనే 389 వరకు బెల్టు షాపులున్నాయంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఎంత అక్రమ మద్యం ప్రవహిస్తుందో అర్థం చేసుకోవచ్చు.

ఈ అక్రమ సంపాదనతో మీరు ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు దేశమంతా ఎన్నికలు చేయగలరు. అధికారిక లెక్కల ప్రకారం దేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి చంద్రబాబు కాగా.. ఎంపీల్లోనూ అత్యంత ధనిక ఎంపీలు టీడీపీలోనే ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొమ్మిదో, పదో స్థానంలో ఉంది. ఇంత ధనికపార్టీ పేదవాడు తాగుతున్న మద్యం బాటిల్ పైన రూ.10 నుంచి రూ.40 వరకు అదనంగా దోచుకుంటున్నారు.

ప్రజల ఆశలను వమ్ము చేసిన పవన్ కళ్యాణ్:
ప్రజలు ఎంతో ఆశగా ఓట్లేసిన విషయం కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మర్చిపోయారు. ఎన్నికల ముందు మీరు అనంతపురం పట్టణంలో కూడా గుంతలున్నాయని ట్రాక్టర్లతో మట్టిపూసి హడావుడి చేశారు. కానీ  అవి ఇప్పటికీ అలాగే ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారూ? ఏడాది పూర్తవుతుంది.. మీరు ఎక్కడైనా అనంతపురంలో ఆ గుంతలు పూడ్చి ఉంటే సభలో చెప్పండి.

దేశం మొత్తం మీద స్వయం సహాయక సంఘాల మహిళలు  అప్పులు మొత్తం తీర్చిన ఏకైక నాయకుడు వైఎస్‌ జగన్‌ మాత్రమే. రూ.27 వేల కోట్లు మహిళా సంఘాల అప్పులను తీర్చిన ఏకైక సీఎం వైఎస్‌ జగన్‌ మాత్రమే. అలా అప్పు తీర్చడంతో పాటు రూ.75 వేల రూపాయలు నాలుగేళ్లలో అందించిన ఘనత కూడా వైఎస్‌ జగన్‌దే. మీరు ఉచిత గ్యాస్, ఫ్రీ బస్సు కూడా తూతూ మంత్రంగానే అమలు చేస్తూ.. మొత్తం చేసేశామని చెబుతున్నారు.

అధికారం ఉండి న్యాయం చేయలేని మీకు పదవులెందుకు?
నేను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించడం వల్లే సుగాలీ ప్రీతి కుటుంబానికి 5 ఎకరాల భూమి, ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చారని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. మీరు ప్రశ్నించడం వల్లే ప్రజలకు మేలు జరుగుతుందనుకుంటే మీరు ప్రతిపక్షంలోనే ఉండి ఆ పని చేయాల్సింది.. అంతే తప్ప ప్రభుత్వంలో ఉండి ఏం చేయలేనప్పుడు మీకు పదవులు ఎందుకు? మీ హయాంలో ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే కనీసం.. బాధితురాలి మృతదేహంలో ఆందోళన చేసే అవకాశం కూడా లేకుండా మృతదేహాలను కూడా కనిపించకుండా చేస్తున్నారు.

నందికొట్కూరు మండలం ముచ్చుమర్రి బాలికపై అఘాయిత్యంలో అదే జరిగింది. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అన్న మాట పచ్చి అబద్ధం అని తలారి రంగయ్య తేల్చి చెప్పారు.  అనంతపురం జిల్లాకు చేసిన అన్యాయానికి పరిహారంగా ఏ మేరకు న్యాయం చేస్తారో సూపర్ సిక్స్ సభ సాక్షిగా సమాధానం చెప్పాలని ఆయన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement